YS  Jagan afraid of suspended TDP mlasఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో తలెత్తిన ప్రశ్న కారణంగా ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ఎన్నికల హామీపై స్పష్టతకు తెదేపా సభ్యుడు రామానాయుడు డిమాండ్‌ చేశారు.

అయితే మేనిఫెస్టోలో అలాంటి హామీ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై శాసనసభలో రగడ జరిగింది. సభకు అంతరాయం కలిగిస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఈ సమావేశాలు ముగిసేవరకు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్‌ దీనిని ఆమోదించారు.

అయినప్పటీ ఆ ముగ్గురు సభ్యులు సభలోనే ఉంటూ నినాదాలు చేయడంతో మార్షల్స్‌ వచ్చి వారిని తీసుకెళ్లారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఆ తరువాత డిప్యూటీ స్పీకర్ ని కలిసి సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. సభలో నిరసన వ్యక్తం చెయ్యడం తమ హక్కు అని. అచ్చెన్నాయుడు అయితే కనీసం స్పీకర్ పొడియం వద్దకు కూడా వెళ్లలేదని తన స్థానంలో నిలబడి మాత్రమే నిరసన తెలిపారని, ఎప్పటినుండో ఆయన మీద అక్కసుతో ఉన్న ప్రభుత్వం ఈ విధంగా ఆయనను సస్పెండ్ చేసిందని వారు అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న జగన్ ఒక్క టీడీపీ ఎమ్మెల్యేకు బయపడుతున్నారా? అని ఆక్షేపించారు.