YS- Jagan 3000 rupees pension schemeరాష్ట్రప్రభుత్వం ఇటీవలే ప్రకటించి అమలు చేస్తున్న 2000 రూపాయిల సామాజిక పెన్షన్లు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. ఈ ప్రకంపనలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా 55 లక్షల మందికి డైరెక్టుగా లబ్ది కూర్చే ఈ పథకాన్ని కౌంటర్ చెయ్యకపోతే ప్రమాదమని గ్రహించి ఒక అడుగు ముందుకు వేశారు జగన్. “మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 45 ఏళ్లకే పింఛను ఇస్తాం. అవ్వా తాతలకు రూ.2 వేలు నుంచి దశల వారీగా ఆ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుతాం,” అని ప్రకటించేశారు జగన్.

అయితే ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ప్లస్ కాకపోగా మైనస్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ప్రజలు ఎప్పుడైనా మాటలు చెప్పే వాడికైనా ఇప్పుడు ఇచ్చే వాడికి ఎక్కువ విలువ. అదే సమయంలో వేలం పాటలా పెంచుకుంటూ పోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చంద్రబాబు 3100 రూపాయిలు పెంచి పెన్షన్ ఇస్తే జగన్ ఏం చేస్తారు? మళ్ళీ 3500, 4000 అంటూ పెంచుకుంటూ పోతారా? దీనికి అడ్డు ఎక్కడ? దీనికి ఏదైనా శాస్త్రీయ అధ్యయనం ఏదైనా ఉందా?

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పెన్షన్లు 1000 రూపాయిలు ఇస్తామని ప్రకటిస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వల్ల అలా ఇవ్వడం కుదరదని 700 మాత్రమే ఇవ్వగలమని చెప్పి అదే విషయం తమ మ్యానిఫెస్టో లో పెట్టారు. ఐదు సంవత్సరాల ముందు 700కు మించి కుదరదని ఇప్పుడు ఏకంగా 3000 రూపాయిలు ఇస్తామంటే దానిని జగన్ ఏ విధంగా సమర్ధించుకుంటారు? కొంపతీసి చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని విపరీతంగా మెరుగు పరిచారా? అలా అని జగన్ ఒప్పుకుంటున్నారా?

ఇటీవలే ఓటు ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. శాసనసభను బహిష్కరించిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్ష పార్టీ సభలో లేదు. అయితే మీడియా ముఖంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ బడ్జెట్ ను ఖండించింది. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన బడ్జెట్ అని, ఎన్నికల గిమ్మిక్ అని తేల్చి చెప్పేశారు. అయితే అదే సమయంలో తాము ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి బడ్జెట్ లో పెట్టారని చెప్పుకొస్తున్నారు. అంటే నవరత్నాలు అమలు చేస్తే అది అశాస్త్రీయమంటే ప్రజలు ఏమనుకోవాలి? ఇలా ఒకటి తరువాత ఒకటి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతున్నారు జగన్.