YS_Avinash_Reddy_Father_YS_Bhaskar_Reddyఇప్పుడు రాజకీయ వార్తల పాటు కోర్టులు, కేసులు, చట్టాలు, సెక్షన్స్ గురించి కూడా చెప్పుకోక తప్పడం లేదు. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సోమవారం తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. అయితే దాంతో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకొన్నారా? అనే సందేహం కలుగుతోంది.

ఈ కేసులో సీబీఐ ఒత్తిడితో అప్రూవరుగా మారిన దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా తనను నిందితుగా పేర్కొనడం సరికాదని భాస్కర్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అసలు ఈ కేసులో దస్తగిరే నిందితుడని అతనే వివేకాను హత్య చేయడానికి ఆయుధాన్ని కొనుగోలు చేశాడని భాస్కర్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కనుక దస్తగిరికి బెయిల్‌ రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి తన పిటిషన్‌లో హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ కేసుతో తమకు ఎటువంటి సంబందమూ లేదని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాదిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా ఆస్తి కోసమే ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఈ హత్య చేయించి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెపుతూ అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు.

వివేకాను ఆయన అల్లుడే హత్య చేయించి ఉండవచ్చని, ఈ హత్యతో తమకు ఎటువంటి సంబందమూ లేదని చెపుతున్నప్పుడు, మరి దస్తగిరే హత్యకు ఆయుధం కొనుగోలు చేశాడని ఎలా చెపుతున్నారు?దస్తగిరితో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం?దస్తగిరి బెయిల్‌ రద్దు చేయాలని హైకోర్టుని ఎందుకు ఆశ్రయించారు?అనే సందేహాలు కలుగుతాయి. కనుక రేపు కోర్టులో ఈ ప్రశ్నలే ఎదురయితే వాటికీ సమాధానాలు చెప్పుకోవలసిరావచ్చు.