Avinash Reddyవివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉండగా, తన తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేరారని కనుక ఈరోజు విచారణకు హాజరుకాలేనని న్యాయవాదుల ద్వారా సీబీఐకి కబురు పంపించి హైదరాబాద్‌ నుంచి పులివెందుల బయలుదేరారు. ఇలాంటి ట్విస్ట్ ఊహించని సీబీఐ అధికారులకు దీంతో ఏమి చేయాలో పాలుపోలేదు.

శ్రీలక్ష్మికి పులివెందులలో ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో అత్యవసర చికిత్స చేసిన తర్వాత వైద్యుల సూచన మేరకు అవినాష్ రెడ్డి అనుచరులు అంబులెన్సులో హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. దారిలో అంబులెన్సులో ఉన్న తల్లిని పరామర్శించి, దాని వెనుకే అవినాష్ రెడ్డి కూడా తన వాహనంలో హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అయ్యారు.

అయితే సీబీఐ ఎప్పుడు విచారణకు పిలిచినా అవినాష్ రెడ్డి ఏదో ఓ సాకుతో తప్పించుకొంటూ, హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేస్తున్నారని, కనుక ఆయనను అరెస్ట్‌ చేయక తప్పదని సీబీఐ న్యాయవాదులే స్వయంగా హైకోర్టుకి చెపుతున్నారు. మొన్న విచారణకు రావాలని నోటీస్ పంపినప్పుడు, మళ్ళీ నేడు ఆయన అలాగే వ్యవహరించారు. ఈసారి తల్లికి అనారోగ్యం సాకుతో విచారణకు హాజరుకాకుండా తప్పించుకొన్నారు. దీంతో సీబీఐ మీద కూడా ఒత్తిడి పెరుగుతూనే ఉంది.

కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ విషయంలో సీబీఐ ఇంతవరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. బహుశః సీబీఐ అధికారులు హాస్పిటల్‌కు వెళ్ళి అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని ఆయన చెపుతున్నది నిజమా లేక విచారణ, అరెస్టును తప్పించుకోవడానికి ఆడిన కొత్త నాటకమా?అని నిర్ధారించుకొంటారు. దానిని బట్టి మళ్ళీ రేపు విచారణకు రావాలని నోటీస్ పంపించడమో లేదా అరెస్ట్‌ చేయడమో చేయవచ్చు.

ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ పూర్తికాలేదు కనుక రేపు విచారణకు హాజరైతే సీబీఐ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. కనుక మళ్ళీ రేపు విచారణకు హాజరుకాకుండా తప్పించుకోవడానికి “ఈ సారి అవినాష్ రెడ్డి తన పిల్లికి ఒంట్లో బాగోలేదని చెపుతారేమో?” అని టిడిపి సీనియర్ నేత బోండా ఉమా ఎద్దేవా చేశారు.