Telangana-High-Court-Avinash-Reddyవివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నేడు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

దీనిపై రెండు రోజుల పాటు హైకోర్టులో అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు, సీబీఐ న్యాయవాదులు హోరాహోరీగా వాదించుకొన్నాక హైకోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ నేటి వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేడు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తునట్లు ప్రకటించడంతో అవినాష్ రెడ్డి వర్గం సంబరాలు చేసుకొంటోంది.

అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు మంజూరు చేసినందున, ఆయన సీబీఐ విచారణకు హాజరైనప్పటికీ అరెస్ట్‌ చేయలేదు. కనుక హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు లేదా విచారణతో సరిపెట్టవచ్చు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉన్నప్పుడే సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయినందున, ఆయన ఒత్తిడి వల్లనే ముందస్తు బెయిల్‌ లభించి ఉండవచ్చని ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు.

ఈ కేసులో కేంద్రం నుంచి సీబీఐ ఒత్తిళ్ళు ఎదుర్కొంటోంది కనుకనే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ లభించేందుకు పూర్తిగా సహకరించిందని ఆరోపించారు. సీబీఐ అలసత్వం కారణంగానే అవినాష్ రెడ్డికి బెయిల్‌ లభించిందని అభిప్రాయపడ్డారు. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసే విషయంలో హైకోర్టు నిందితుడు (అవినాష్ రెడ్డి) హక్కులను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ద చూపింది తప్ప బాధితులు (వివేకానంద రెడ్డి, సునీతారెడ్డి)ల హక్కులను కాపాడాలనుకోకపోవడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ తీర్పుపై సీబీఐ మొక్కుబడిగా సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌లో అప్పీలు చేస్తే చేస్తుందని కానీ సునీతారెడ్డి తప్పక అప్పీలు చేస్తారని భావిస్తున్నానని న్యాయవాది శ్రావణ్ కుమార్‌ అన్నారు.