YS-Avinash-Reddy-Meets-YS-Vijayammaవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయంలో విచారణకి రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణకి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన అవినాష్ రెడ్డి, ముందుగా లోటస్ పాండ్‌కి వెళ్ళి సిఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఆశీర్వాదాలు తీసుకొన్నట్లు వస్తున్న వార్తలు చాలా విస్మయం కలిగిస్తున్నాయి.

ఆయనేమీ ఎన్నికలలో నామినేషన్‌ వేయడానికో లేదా పదవి చేపట్టడానికో వెళ్ళడం లేదు. వివేకా హత్య కేసులో నేరారోపణ ఎదుర్కొంటూ సీబీఐ ఎదుట విచారణకి హాజరవుతున్నారు. ఆయనకి ఈ కేసుతో ప్రమేయం ఉందా లేదా అనేది సీబీఐ తెలుస్తుంది. కానీ ఆయనపై వివేకా కుమార్తె సునీతారెడ్డి మొదటే అనుమానం వ్యక్తం చేశారు. కనుక ఆయన విజయమ్మ ఆశీర్వాదం కోరడం, సొంత మరిది హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని విజయమ్మ ఆశీర్వదించి పంపడం నిజమైతే ఏమనుకోవాలి? ఓ పక్క ఆమె కుమార్తె వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇద్దరూ ఈ కేసు విచారణ త్వరగా పూర్తిచేసి దోషులకి శిక్ష పడేలా చేయాలని కోరుతుంటే, విజయమ్మ అవినాష్ రెడ్డిని ఆశీర్వదించి పంపడం నిజమైతే ఆమె ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిన్నట్లే కదా?

అయితే అవినాష్ రెడ్డి తాను నిరపరాదినని, మీడియా తన గురించి తప్పుడు కధనాలు ప్రచురిస్తూ, తన ప్రతిష్టని, వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తోందని ఆరోపిస్తున్నారు. మీడియా కారణంగా తాను చాలా మానసిక వేదన అనుభవిస్తున్నానని, సీబీఐ ఎదుట తాను నిర్ధోషినని నిరూపించుకొంటానని చెప్పారు. ఆయన వాదనలని, మీడియా సంగతిని పక్కన పెడితే సీబీఐ ఛార్జ్ షీట్‌లో ఆయనకి ఈ హత్యతో ప్రమేయం ఉందని స్పష్టంగా పేర్కొంది కదా?