వైసీపీ నేతల కోర్టు కేసుల పుణ్యమాని సామాన్యులకు కూడా ఈ కోర్టులు, కేసులు, వాయిదాలు, రిమాండ్, పోలీస్ కస్టడీ, బెయిల్, ముందస్తు బెయిల్ వంటి న్యాయపరమైన అంశాల పట్ల అవగాహన ఏర్పడింది. అలాగే జూనియర్ న్యాయవాదులుగా చేరినవారు కూడా కేసులు ఏవిదంగా సాగదీయవచ్చో బహుశః బాగా నేర్చుకొనే ఉంటారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులపై విచారణ జరుపుతున్న సీబీఐ 2012, మార్చి 31న తొలి ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అప్పటి నుంచి ఆ కేసుల విచారణ నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. బహుశః 10-20 ఏళ్ళు విచారణ జరిగినా ఆశ్చర్యం లేదు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై 2022, మార్చి నుంచి సీబీఐ విచారణ ప్రారంభించింది. ఆ కేసు విచారణ కూడా నేటికీ సీబీఐ-అవినాష్ రెడ్డి-హైకోర్టు-సుప్రీంకోర్టు మద్య తిరుగుతూనే ఉంది. ఇదికాక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేసు కూడా నడుస్తూనే ఉంది. వైసీపీ నేతలు ఈ నాలుగు కేసులను నడిపిస్తున్న తీరు చూస్తే, వారి కోసమే ప్రత్యేకంగా ఓ హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.
రోడ్డు ప్రమాదాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సినిమా రిలీజ్ వార్తలలాగే వివేకా హత్య కేసు కూడా ‘డైలీ న్యూస్ ఐటెమ్’గా మారిపోవడం విశేషం. కనుక ముందుగా ఈ కేసుకు సంబందించిన విషయాలు చెప్పుకోక తప్పదు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో కర్నూలులో ఆసుపత్రిలో నాలుగు రోజులు చికిత్స చేయించడంతో ఆమె కోలుకొన్నారు. కనుక ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ఆమె హాస్పిటల్లో ఉన్నందున అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాలేకపోయారు. హాస్పిటల్ చుట్టూ ఆయన అనుచరులు కాపలాకాస్తుండటంతో సీబీఐ ఆయనను అరెస్ట్ చేయలేకపోయింది.
ఈ కేసులో కొత్తగా మరో ఇద్దరు పాత్రధారులు ఎంట్రీ ఇచ్చారు. ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలా రెడ్డి. మరొకరు కెఏ పాల్. ఇద్దరూ అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు.
వివేకాను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసి, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారమే విచారణ జరిపి తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దానిపై నిన్న విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈరోజు కూడా విచారణ జరుపుతోంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మళ్ళీ ఈ కేసుపై హైకోర్టు విచారణ జరుపనుంది. కనుక సీబీఐ-అవినాష్ రెడ్డి-హైకోర్టు-సుప్రీంకోర్టు చక్రంలో ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు వరకు వచ్చింది. బహుశః మళ్ళీ మొదటి నుంచి చక్రం తిరిగినా ఆశ్చర్యం లేదు. కనుక ఏదో జరిగిపోబోతోందనే మీడియాలో వార్తలు చూసి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు.