YS_Avinash_Reddy_CBIవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులలో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నేడు మరోసారి హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ఇప్పటికే జనవరి 28న మొదటిసారి, ఫిభ్రవరి 24న రెండోసారి, నేడు మూడోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.

ఈసారి సీబీఐ అధికారులు తనను అరెస్ట్ చేస్తారని భావిస్తున్న ఆయన తనని అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో గురువారం పిటిషన్‌ వేశారు. దానిపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఓవైపు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తుంటే, అదేసమయంలో మరోవైపు హైకోర్టులో ఆయన పిటిషన్‌పై విచారణ జరుగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయవచ్చని పుకార్లు వినిపిస్తుండటంతో భారీ సంఖ్యలో ఆయన అనుచరులు కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. అక్కడ వారి హడావుడి ఎక్కువ అవడంతో పోలీసులు వారిలో కొంతమందిని అదుపులో తీసుకొన్నట్లు తెలుస్తోంది.

ఈరోజు అవినాష్ రెడ్డితో పాటు చంచల్‌గూడ జైలులో ఉన్న ఈ కేసులోని నలుగురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డిలతో పాటు అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు.

హైకోర్టులో అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఈ హత్య కేసుతో ఆయనకు ఎటువంటి సంబందమూ లేనప్పటికీ చట్టాన్ని గౌరవించి సీబీఐ పిలిచినప్పుడల్లా విచారణకు హాజరవుతున్నారని, ఈ కేసు విచారణలో పూర్తిగా సహకరిస్తున్నారని వాదిస్తున్నారు. కనుక ఆయనని అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు.

అనూహ్యంగా ఈ కేసు విచారణలో వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా ఇంప్లీడ్ (చేరారు) అయ్యారు. ఈరోజు మధ్యాహ్నమే ఆమె తన లాయర్‌తో కలిసి హైకోర్టు వద్దకు చేరుకొన్నారు.

వివేకా రెండో పెళ్ళి చేసుకొన్నప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యుల మద్య గొడవలు జరుగుతున్నాయని, కానీ సీబీఐ ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా, అప్రూవర్‌గా మారిన దస్తగిరి అక్కడా ఇక్కడా చెప్పిన మాటలను, గూగుల్ టేకవుట్ ఆధారంగా సునీల్ యాదవ్ ఫోన్‌ లొకేషన్స్ మాత్రమే పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేస్తూ, వివేకాను అవినాష్ రెడ్డే హత్య చేయించారంటూ ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తరపు న్యాయవాది వాదించారు.

అవినాష్ రెడ్డి తాజా పిటిషన్‌లో వివేకానంద రెడ్డి కుటుంబంపైనే ఆరోపణలు చేసినందున, వాటిని ఖండించేందుకు ఆయన కుమార్తె సునీతా రెడ్డి కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించుకొన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని కోరుతూ వేసిన తాజా పిటిషన్‌ విచారణలో సునీతా రెడ్డి ప్రవేశించడంతో కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఇకపై ఆమె అవినాష్ రెడ్డిని నేరుగానే ఎదుర్కొనేందుకు సిద్దపడిన్నట్లు స్పష్టమైంది.

అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయబోతోందా?చేస్తున్నట్లయితే సీబీఐని హైకోర్టు అడ్డుకొంటుందా లేదా అవినాష్ రెడ్డి పిటిషన్‌ను తిరస్కరిస్తుందా?ఈ హత్య కేసు గురించి సునీతారెడ్డి ఈరోజు హైకోర్టులో ఏం చెప్పబోతున్నారు?వంటి అనేక ప్రశ్నలకు మరికొన్ని గంటలలో సమాధానాలు లభించనున్నాయి.