YS_Jagan_Delhi_Tourసిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు, అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా ఆపడానికే అంటే బోడి గుండుకు మోకాలుకు ముడిపెట్టడమే అని వైసీపీ, బిజెపిలు వాదిస్తుంటాయి. సీబీఐ ఎవరినైనా అరెస్ట్‌ చేయాలనుకొంటే దానిని ఏ ‘అదృశ్యశక్తి’ అడ్డుకోలేదని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు మొన్ననే సర్టిఫై చేశారు. కానీ సీబీఐ, చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కనిపెట్టి చెప్పారు. కనుక సీబీఐని నియంత్రించవలసిన అవసరం ఏర్పడిందని సూచిస్తునట్లే భావించవచ్చు. బహుశః అందుకే సిఎం జగన్‌ ఢిల్లీకి వెళ్ళారేమో?అని సందేహించడానికి వీల్లేదు.

ఈసారి సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రెండు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. 1. ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగబోయే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు. 2. రేపు ఉదయం కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు.

కనుక ఇదే సమయంలో అవినాష్ రెడ్డి కధ ప్రీ-క్లైమాక్స్‌కు చేరుకోవడం ‘జస్ట్ కో-ఇన్సిడెన్స్’ అని చెప్పుకొనే వెసులుబాటు వైసీపీకి ఉంది. లేదా ఈ రెండు కార్యక్రమాలు చాలా ముందుగానే నిర్ణయించబడ్డాయి కనుక ‘అదృశ్యశక్తులు’ సాయం కోసమే అవినాష్ రెడ్డి ఈ డైలీ సీరియల్‌ను ఈరోజు వరకు పొడిగించుకొన్నారని గిట్టనివారు చెప్పుకోవచ్చు.

కనుక ఒకవేళ నేడు తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తే, సీబీఐ ఆయనను అరెస్ట్‌ చేస్తుందా లేక నోటీసు పంపించి విచారణకు హాజరుకావాలంటూ మళ్ళీ ఈ డైలీ సీరియల్ కొనసాగించేందుకు ఆయనకు అవకాశం కల్పిస్తుందో చూస్తే సీబీఐ మీద ‘అదృశ్యశక్తులు’ ప్రభావం ఉందో లేదో తెలుస్తుంది.

ఈ కేసులో కొసమెరుపు ఏమిటంటే, అమాయకుడైన అవినాష్ రెడ్డిని టిడిపి ఒత్తిళ్ళకు తలొగ్గి సీబీఐ విచారణ, అరెస్ట్‌ పేరుతో వేధిస్తున్నందుకు ఇటు వైసీపీ, అదృశ్య శక్తుల ఒత్తిళ్ళకు తలొగ్గి అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా తాత్సారం చేస్తోందంటూ అటు టిడిపి రెండూ కూడా సీబీఐనే నిందిస్తుండటం!