YS-Avinash-Reddy-Jaganవివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మళ్ళీ నాలుగు రోజులు ఉపశమనం కల్పించింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 25నే విచారణ చేపట్టి తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, ఆయన తరపు న్యాయవాదులు సుదీర్గ వాదనలు చేస్తుండటంతో మూడు రోజులుగా విచారణ కొనసాగుతూనే ఉంది.

ఒక రాజకీయ నాయకుడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇన్ని రోజులు ఇంత సుదీర్గంగా విచారణ జరపడం బహుశః న్యాయ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, ఈ కేసుపై తుది తీర్పు ఈ నెల 31న వెలువరిస్తామని, అంతవరకు ఆయనను అరెస్ట్‌ చేయవద్దని సీబీఐకి ఉత్తర్వులు జారీ చేసింది. కనుక అవినాష్ రెడ్డికి మళ్ళీ మరో నాలుగు రోజులు ఉపశమనం లభించింది.

వివేకా హత్య కేసును సీబీఐ దాదాపు నాలుగేళ్ళుగా విచారణ చేస్తున్నప్పటికీ పూర్తి చేయలేకపోయిందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారి రామ్‌ సింగ్‌ను తొలగింపజేసింది. ఆయన స్థానంలో నియమితులైన కెఆర్ చౌరాసియాను ఏప్రిల్ 30లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ విచారణ పూర్తికాకకపోవడంతో, మళ్ళీ జూన్ 30వరకు గడువు పొడిగించింది.

అయితే మే నెల మొత్తం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణతోనే సరిపోయింది. సుప్రీంకోర్టు స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ తెలంగాణ హైకోర్టు ఆయనకు గడువు ఇస్తుండటం, సీబీఐకి గడువు దగ్గర పడుతున్నా చాలా తాపీగా నోటీస్ పంపించి తర్వాత హడావుడి చేస్తుండటం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

ఇదివరకు కూడా సీబీఐ-హైకోర్టు-సుప్రీంకోర్టు మద్య ఇదే తంతంగం నడిచింది. కనుక అవినాష్ రెడ్డి అరెస్ట్‌ విషయంలో కలుగజేసుకోమని హైకోర్టు బుదవారంనాడు చెపితే ఇదే తంతు మళ్ళీ మొదటి నుంచి పునరావృతం కావచ్చు. అవినాష్ రెడ్డిని విచారణకే రప్పించలేక హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్న సీబీఐ, ఆయనను ఎలా అరెస్ట్‌ చేయగలదు?ఎప్పుడు ప్రశ్నిస్తుంది?ఎప్పుడు నిజాలు వెలికి తీస్తుంది? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.