YS-Avinash-Reddy_Supreme-Courtవివేకాహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ విచారణకు హాజరవుతున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో కాస్త ఉపశమనం లభించింది. కాస్త ఎదురుదెబ్బ కూడా తగిలింది. ఈ నెల 25వరకు ఆయనను అరెస్ట్‌ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ విచారణ చేపట్టి, హైకోర్టు తీరుని ఆక్షేపించారు. ఈ కేసులో హైకోర్టు తీర్పు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అవినాష్ రెడ్డిని ఈనెల 25వరకు అరెస్ట్‌ చేయరాదనే హైకోర్టు మద్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్టే విదిస్తే సీబీఐ వెంటనే అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేస్తుందని, కనుక ఈ కేసు(సునీతారెడ్డి పిటిషన్‌)లో తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరిస్తూ సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు మళ్ళీ ఈ కేసువిచారణ చేపట్టి తుది తీర్పు ప్రకటిస్తామని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.

తెలంగాణ హైకోర్టు మంగళవారం వరకు అరెస్ట్‌ చేయవద్దని చెపితే, సుప్రీంకోర్టు దానిని ఒకరోజు తగ్గించి సోమవారం వరకు వద్దని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికిప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశించింది కనుక ఆ మేరకు ఆయనకు ఉపశమనం లభించిన్నట్లే. కానీ ఈ కేసు విచారణ జరుగుతున్న తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడం అవినాష్ రెడ్డికి, ఆయనకు అండగా నిలబడుతున్న వైసీపీ ప్రభుత్వానికి చాలా ఆందోళన కలిగించే విషయమే. ఈరోజు విచారణ సందర్భంగా ఈకేసు గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే సుప్రీంకోర్టు ఎటువంటి అభిప్రాయంతో ఉందో అర్దమవుతోంది. కనుక తెలంగాణ హైకోర్టు కూడా సుప్రీంకోర్టుకి అనుగుణంగానే వ్యవహరిస్తూ కేసు విచారణ చేయవచ్చు. అంటే అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకొంటునట్లే భావించవచ్చు. కనుక ఆయనను గట్టిగా వెనకేసుకువస్తున్న జగన్ ప్రభుత్వం మళ్ళీ ఢిల్లీలో పావులు కదపక తప్పదేమో?