Youtube records for Gautamiputra Satakarni trailer‘మెగాస్టార్’ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న “ఖైదీ నంబర్ 150” టీజర్ విడుదల కాగానే సోషల్ మీడియా అంతటా ‘మెగా’ హంగామానే. స్క్రీన్ షాట్లు, చిరు డైలాగ్ లతో ఫేస్ బుక్, ట్విట్టర్లు దద్దరిల్లాయి. ఇక, యూ ట్యూబ్ రికార్డులైతే సరే సరి. కేవలం 3.5 గంటల్లోనే 1 మిలియన్ క్లిక్స్ ను అందుకుని సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంది. అలాగే తొలి వారంలో 5 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకుని, ‘మెగాస్టార్’ సత్తాకు నిదర్శనంగా నిలిచింది.

ఇక్కడ కట్ చేసి, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ కు దగ్గరికి వస్తే… విడుదలైన 12 గంటల లోపే 1 మిలియన్ క్లిక్స్ ను అందుకుని, బాలకృష్ణ చిత్రాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. చిరంజీవి ‘ఖైదీ’ అంతటి స్థాయిలో కాకపోయినా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అందుకున్న క్లిక్స్ చెప్పుకోదగినవే. అయితే మెగాస్టార్ టీజర్ కు, నందమూరి నటసింహం ట్రైలర్ కు వచ్చిన స్పందనలలో మాత్రం తీవ్ర వ్యత్యాసం కనపడుతోంది.

భారీ అంచనాలతో విడుదలైన “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా ధియేటిరికల్ కు అన్ని వర్గాల నుండి అదిరిపోయే స్పందన రాగా, ‘ఖైదీ’ మాత్రం ఒక్క మెగా అభిమానుల వరకే పరిమితమైంది. ‘ఖైదీ’లో చిరంజీవి లుక్ ఒక్కటే హైలైట్ కాగా, ‘శాతకర్ణి’ బాలయ్య లుక్ తప్ప అన్ని హైలైట్స్ గా నిలిచాయి. అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ట్రైలర్ గా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి పట్టాభిషేకం చేయగా, ‘ఖైదీ’ కేవలం కమర్షియల్ యాంగిల్ లోనే చూడాల్సి వచ్చింది.

వర్మ చెప్పినట్టు… సంక్రాంతి రేసులో ఉన్న ఈ రెండు పెద్ద సినిమాలలో ప్రస్తుతానికి ‘ఖైదీ’పై పైచేయి సాధించడంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయవంతం అయ్యింది. అయితే ఈ ఆధిపత్యం రావడానికి ప్రధాన కారణం మాత్రం దర్శకుడు క్రిష్ అనే చెప్పాలి. రాజమౌళి వంటి వారు సైతం ‘జై’ కొట్టే విధంగా, కేవలం 8 నెలల కాలంలో పరిమిత బడ్జెట్ లో ఈ రేంజ్ లో తెరకెక్కించిన విధానమే ‘శాతకర్ణి’ అద్భుతమైన స్పందనకు కారణం.