Akhil Agentతెలుగు సినిమాకే కాదు దేశంలో ఏ బాషా పరిశ్రమకైనా డిజాస్టర్లు సహజం. వీటిని చూడని హీరోలు ప్రపంచ చరిత్రలోనే ఉండరు. కానీ ఒకప్పుడు ఇలాంటి ప్రతికూల ఫలితాలు నిర్మాతలకు విపరీత నష్టాలను కలిగించేవి కాదు. ఎందుకంటే సినిమా బాలేదని తెలిసినా ఎంటర్ టైన్మెంట్ కు ఆప్షన్ లేదు కాబట్టి సర్దుకుని అంతో ఇంతో ప్రత్యేకంగా ఒక వర్గం ఆడియన్స్ వీటిని చూసేవాళ్ళు. కానీ రోజులు మారాయి. వీకెండ్ లో థియేటర్ కు వెళ్లకపోతే ఏదో అయిపోతుందనే బాపతు వర్గం టికెట్లు కొనడం చాలామటుకు తగ్గిపోయింది.

తాజాగా ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద మొదటి ఆటకే చేతులెత్తేసింది. అఖిల్ కష్టమంతా దర్శకుడు సురేందర్ రెడ్డి నాసికరం దర్శకత్వంలో వృథా అయిపోయింది. రెండో రోజే తల్లి అమల ఇన్స్ టాలో ఓదార్పు చెప్పాల్సి వచ్చింది. ఆరు పలకల దేహం, కాకినాడ షాపింగ్ మాల్ పైఅంతస్థు అంత ఎత్తు నుంచి దూకినా లాభం లేకపోయింది. కొంచెం వెనక్కు వెళ్తే లైగర్ విషయంలో విజయ్ దేవరకొండ చూపించిన ఉత్సాహం, కమిట్ మెంట్ పూరి జగన్నాధ్ తప్పిదాల వల్ల మొత్తం ప్యాన్ ఇండియా లెవెల్ లో గంగపాలవ్వడం ఇంకా గుర్తే.

Also Read – స్కిల్ డెవలప్‌మెంట్‌ అంటే బూతు కాదురా నాయినా!

అంతకు ముందు నాగ శౌర్య ఇదే తరహాలో లక్ష్య కోసం విపరీతంగా శారీరక శ్రమ తీసుకుని సంతోష్ జాగర్లపూడిని నమ్మితే అది నిలువునా నిర్మాతలకు ముంచేసింది. ఈ కుర్ర హీరోల ఇంతగా తాపత్రయపడి రిస్కులకు సిద్ధపడటం మంచిదే. కానీ అవి సరైన కథలకు సినిమాలకు ఉపయోగపడాలి. అంతే తప్ప నాసిరకం కంటెంట్ తో కనీసం ఫ్యాన్స్ నైనా మెప్పించలేనప్పుడు ప్రయోజనం ఏముంది. ఇంతకు ముందు అల్లు అర్జున్, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లు సిక్స్ ప్యాక్ లు చేసి హిట్లు సాధించారుగా.

తప్పు ఎవరిదైనా చివరిగా బాధితులుగా మిగిలేది ముందు నిర్మాతలే. కెరీర్ పరంగా డైరెక్టర్ కూ దెబ్బ పడుతుంది. స్టార్ దర్శకుడైతే ఇంకో అవకాశం సులభం దక్కుతుంది. కానీ మార్కెట్ లో ఇమేజ్ దెబ్బ తిన్న హీరోల మీద పెట్టుబడుల మొత్తం తగ్గుతూ పోతుంది. యాభై కోట్లు పెట్టడానికి రెడీ అయిన ప్రొడ్యూసర్ ఫ్లాపులు చూశాక ముప్పై కంటే రిస్క్ చేయలేను అంటాడు. అప్ కమింగ్ మీడియం రేంజ్ స్టార్లకు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇకనైనా కండలు చూపించే ఛాన్స్ ఉన్న కథలు కాకుండా తమ సత్తా చాటే స్క్రిప్ట్ ల మీద శ్రద్ధ పెడితే అద్భుతాలు చేయొచ్చు. పొట్టేసుకుని మరీ సక్సెస్ లు అందుకునే విజయ్ సేతుపతి కన్నా ఉదాహరణ ఏం కావాలి.

Also Read – ప్రత్యేక హోదా : అసలు దాని పేరు పలికే హోదా ఉందా.?