YCP starts attack on Pawan Kalyanగత మూడేళ్ళుగా ఏపీలో సాగిస్తోన్న అధికార పార్టీ పాలనను తూర్పారపడుతూ సాగిన ‘జనసేన’ ఆవిర్భావ సభ అలా ముగిసిందో లేదో, పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శల దాడిని షురూ చేసారు. ఏ సామాజిక వర్గపు నేత తమను విమర్శిస్తే, అదే సామాజిక వర్గపు నేతను మీడియా ముందుకు పంపించే వైసీపీ, పవన్ కళ్యాణ్ పైకి మంత్రి పేర్ని నానిని వదిలారు.

రాష్టంలో మూడేళ్ళుగా జరుగుతున్న అభివృద్ధి పవన్ కళ్యాణ్ కు కనిపించలేదా? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారా? మీ వెనుక ఉన్న బీజేపీని ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీని ఎందుకు అడగలేకపోతున్నారు? విశాఖ రైల్వేజోన్ గురించి అడగరా? పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రశ్నించరా? అంటూ పవన్ పై ఎదురుదాడి చేసారు.

ఈ ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడ నుండి నేర్చుకున్నారు? అంతిమంగా చంద్రబాబే మేలే మీ లక్ష్యంగా మీ అంతరంగం కనపడుతోందని పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. 2019 ఎన్నికలకు ముందు నుండి పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఇలాంటి ఆరోపణలనే చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి జనసేన అధినేతపై అదే ఆరోపణలను వెలిబుచ్చారు.

151 సీట్లతో అధికారం కట్టపెట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం, కడప ఉక్కు సాధించమని చెప్తే, ఒక్క సీటు ఇచ్చిన వ్యక్తిని ఇవన్నీ తీసుకురావాలని చెప్పడం అధికార పార్టీ నిస్సహాయతను సూచిస్తోందా? లేక తమ వలన ఇవేమీ కాదు, మేము ఇవి సాధించలేమని వైసీపీ పరోక్షంగా చెప్తోందా? వీటి కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేయాల్సి వస్తే, 151 సీట్ల అధికారానికి అర్ధం ఏముంటుందో కూడా పేర్ని నాని చెప్తే సబబుగా ఉండేదేమో!?