వికలాంగ విద్యార్ధుకేలా... వైసీపీ రంగులు..!అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు పార్టీ రంగులకు ఇచ్చిన ప్రాధాన్యత మరే ఇతర అంశానికి ఇవ్వలేదన్న విమర్శలు వైఎస్సార్సీపీపై నానాటికి పెరిగిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా, తాజాగా విద్యార్థుల ముఖాలకు వైసీపీ పార్టీ రంగులు పూసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

రేపటి తరం ఆశాజ్యోతులైన విద్యార్థులు… అందులోనూ వికలాంగులు… ఇలా వారిని పార్టీ ప్రచారానికి వాడుకోవడం పట్ల నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చదువుకునే విద్యార్థులన్న కనికరం కూడా లేకుండా పోయిందా అంటూ సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ప్రశ్నలకు కొదవలేదు.

హోమ్ మంత్రి ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో స్వామి భక్తిని ప్రదర్శించడానికి విద్యార్థులే వేడుక అయ్యారా? విద్యార్థులను ఇలా తయారుచేసిన ఉపాధ్యాయులు దీనికి జవాబిస్తారా? లేక వారిని అలా సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఇందుకు సంజాయిషీ ఇచ్చుకుంటారా? అని ప్రశ్నించడం నెటిజన్ల వంతవుతోంది.

గతంలో కూడా ఇలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ రంగులు అద్దిన వైసీపీ చర్యలను హైకోర్టు నియంత్రిస్తూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాలలో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో తమ పార్టీ రంగులను ప్రచార అస్త్రాలుగా మార్చుకున్న వైనం లేదన్న అంశాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

నిజానికి ఇలాంటి ప్రచారం వలన ప్రజలలో వైసీపీ పట్ల వ్యతిరేక భావాలు పెరిగే అవకాశమే తప్ప, సానుకూలత ఉండదన్న విషయం పార్టీ అధినేత అయినా గుర్తుంచుకోవాలి. ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట వేసే విధంగా భవిష్యత్తులో అయినా ముఖ్యమంత్రి జగన్ వర్యులు ఏదైనా ఓ ప్రకటన చేస్తారేమో చూడాలి.