MLC_Driver_Subramanyam_Murder_Caseఅవును… కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానస్పద మృతి కేసులో నిందితుడిగా అనుమానింపబడుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (ఉదయ్ బాబు)ను పోలీసులు అరెస్ట్ చేయవలసి ఉండగా, సుబ్రహ్మణ్యం తల్లితండ్రులను, భార్యను అదుపులోకి తీసుకొన్నారు!

ఈరోజు వారు ముగ్గురూ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన ఉప్పాడ కొమరగిరికి వెళుతుండగా పోలీసులు వారిని అదుపులో తీసుకొని కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు తీసుకువచ్చారు.

సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు అనుమతిస్తూ పత్రాలపై సంతకాలు చేయడం లేదని, అందుకే వారిని అదుపులో తీసుకొన్నామని పోలీసులు చెపుతున్నారు. అయితే ముందు ఎమ్మెల్సీ ఉదయ్ బాబును అరెస్ట్ చేయాలని, అప్పుడే సంతకాలు పెడతామని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు పట్టుపడుతున్నారు. దీంతో పోలీసులు వారి చేత సంతకాలు పెట్టించేందుకు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.

విషయం తెలుసుకొన్న హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్‌ వెంటనే అక్కడకు చేరుకొని బాధిత కుటుంబాన్ని తక్షణం విడిచిపెట్టాలని కోరుతూ, వారి బంధువులతో కలిసి మార్చురీ వద్ద బైటాయించి ధర్నా చేశారు. నిందితుడు ఉదయ్ బాబు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కనుకనే పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయడం లేదని శ్రవణ్ కుమార్‌ ఆరోపిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయవలసిన పోలీసులు బాధిత కుటుంబాన్ని అదుపులో తీసుకొని సంతకాలు పెట్టాలంటూ భయపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు జీజీహెచ్ వైద్యులు అనుమతి పత్రాల కోసం ఎదురుచూసి అవి రాకపోవడంతో డ్యూటీ దిగి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి వీలైనంత త్వరగా పోస్టుమార్టం చేయకపోతే మృతదేహం కుళ్ళిపోతుందని చెప్పారు. ఒకవేళ పోలీసులు రేపు అనుమతి పత్రం తీసుకువస్తే రేపే పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు.

సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉందని, అది రాగానే పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని ఏపీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తిరుపతిలో చెప్పారు.

కానీ ఎమ్మెల్సీ ఉదయ్ బాబును అరెస్ట్ చేస్తేగానీ పోస్టుమార్టంకు అంగీకరించమని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు చెపుతున్నారు. వారు అనుమతిస్తే కానీ పోస్టుమార్టం చేయలేమని వైద్యులు చెపుతున్నారు. కనుక పోలీసులు ఎమ్మెల్సీ ఉదయ్ బాబును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తేల్చుకోవలసి ఉంది.

ఒకవేళ ఈ వ్యవహారం ఇలాగే కొనసాగుతుంటే, అప్పుడు హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని ఎమ్మెల్సీ ఉదయ్ బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచమని పోలీసులను ఆదేశించవచ్చు. అయినా నిందితుడిని పట్టుకోకుండా, బాధిత కుటుంబాన్ని నిర్బందించడం ఏమిటి విడ్డూరంగా? రేపు న్యాయస్థానం కూడా ఇదే ప్రశ్న అడిగితే కాకినాడ పోలీసులు ఏమి సమాధానం చెపుతారో?