YCP_MLC_Anantha_Uday_Bhaskarకాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానస్పద మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏపీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉందని, అది రాగానే పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు.

ఈరోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, “విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారం కేసు సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకొన్నాము. మాజీ మంత్రి నారాయణ కేసులో ఏసీపీ సుజాత సహకరించకపోవడం వలననే ఆమెను సస్పెండ్ చేయవలసి వచ్చింది,” అని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించినప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్ భాస్కర్ ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన చెప్పినట్లు సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలోనే మరణించినట్లయితే ఆజ్ఞాతంలోకి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? రాష్ట్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక నేరుగా డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి సుబ్రహ్మణ్యం ఏవిదంగా చనిపోయారో వివరించి, ఈ కేసు కొలిక్కి వచ్చేవరకు పోలీసులకు అందుబాటులో ఉండవచ్చు కదా” అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో నిజానిజాలు తెలుసుకొనేందుకు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కేసులో అధికార వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్ భాస్కర్‌ నిందితుడిగా ఉన్నందున పోలీసులు ఆయనను ఈ కేసు నుంచి తప్పించి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

టిడిపి నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఈరోజు ఉదయం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ వద్ద ఉన్న సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు రాగా వారిని పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. ఎమ్మెల్సీ అనంత భాస్కర్‌ను పోలీసులు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు పోలీసులను ప్రశ్నించారు కానీ సమాధానం లేదు.