Bhumana Karunakara Reddyటిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఏ విధంగా అయినా కార్నర్ చేయాలని అధికార పార్టీ నేతలు చేస్తోన్న విమర్శలు నవ్వులు పాలు అవుతున్నాయి. అసెంబ్లీ వేదికగా పార్ధసారధి చేసిన ‘హైటెక్ సిటీ – వైఎస్సార్ ఫీజు రీ ఎంబర్సుమెంట్’ హంగామా సోషల్ మీడియాలో ముగియక ముందే, మరో వైసీపీ చంద్రబాబుపై చేసిన విమర్శలు ట్రోల్స్ కు గురవుతున్నాయి.

వరద ప్రభావిత ప్రాంతాలలో చంద్రబాబు నేరుగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతిలో వరదలకు కారణం చంద్రబాబేనని మండిపడ్డారు. అలాగే తిరుపతిలో ఉన్న 43 చెరువులు చంద్రబాబు ప్రభుత్వంలో కబ్జాకు గురయ్యాయని ఆరోపణలు చేసారు.

ఓ పక్కన వరదల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే… భూమన రాజకీయ ఆరోపణలు చేయడం ప్రజల ఆగ్రహానికి కారణం కాగా, ఒకవేళ భూమన చేసిన ఆరోపణలు నిజమని భావిస్తే, గత రెండేళ్లుగా ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది? ఈ కబ్జాపై చట్ట పరంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

బహుశా వరదలు వచ్చాకా ఈ కబ్జాలను బయట పెడదామని చూసారేమో! అంటూ ఛలోక్తులు విసరడం నెటిజన్ల వంతవుతోంది. వరదలకు కారణం చంద్రబాబు అంటూ సరిపెట్టారు గానీ, వైసీపీని ఇబ్బంది పెట్టడానికి ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు కూడా చంద్రబాబే కురిపించారని అనలేదు… సంతోషం..! అన్న కామెంట్స్ కు సోషల్ మీడియాలో కొదవలేదు.