YCP Making Grand Arrangements to Welcome PM Modi to Vizagప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖకి చేరుకొంటారు. ఆయనకు గవర్నర్ బిశ్వభూషన్, సిఎం జగన్మోహన్ రెడ్డి, డిజిపి, మంత్రులు, ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలకనున్నారు. శనివారం ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరుగబోయే బహిరంగసభకు జగన్ ప్రభుత్వం నభూతో నభవిష్యత్ అన్నట్లు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు లక్ష మందికి పైగా జనసమీకరణ చేస్తోంది. విశాఖలో ప్రధాని రోడ్ షోలో అడుగడుగునా ఆయనకు జేజేలు పలికేందుకు వేలాదిమందిని రోడ్లకిరువైపులా నిలుపబోతోంది. ఇక ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ ఎక్కడిక్కడ ఫ్లెక్సీ బ్యానర్లు, ఆయన విశాఖలో శంకుస్థాపన చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించి, ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేస్తోంది. అలాగే న్యూస్ పేపర్ల ఫుల్ పేజ్ యాడ్స్ ఇవ్వబోతోంది.

శనివారం మధ్యాహ్నం ప్రధాని బహిరంగసభను విజయవంతం చేయడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న ఈ హడావుడితో ఏపీ బిజెపి నేతలు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఇక బిజెపి మిత్రపక్షం జనసేనను ప్రధాని నరేంద్రమోడీ దరిదాపుల్లోకి కూడా రానీయకపోవచ్చు.

వైసీపీ హడావుడికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 1. విశాఖ రాజధానిగా ఉండాలనే తమ వాదనకు బలం చేకూర్చేవిదంగా ప్రధాని నరేంద్రమోడీ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తుండటం. 2. వీలైతే ఎన్నికలలో బిజెపితో పొత్తులు లేకుంటే సఖ్యత. 3. అప్పుల కోసం. 4. కేసుల కోసం. కారణాలు ఏవైనప్పటికీ ఇదేదో వైసీపీ ప్లీనరీ సభ అన్నట్లే వైసీపీ నేతలు హడావుడి పడుతున్నారు.

అయితే ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా, విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు, విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు వంటి అనేక విభజన హామీలపై మాట తప్పడమే కాకుండా, మరోపక్క ఎన్నో ఏళ్ళు పోరాడి సాధించుకొన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ని అమ్మేస్తుంటే వైసీపీ ప్రభుత్వం నిసిగ్గుగా జేజేలు పలకడం ఏమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని పట్టించుకొనే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదిప్పుడు. కనుక ప్రధాని నరేంద్రమోడీకి రెడ్ కార్పెట్ వెల్‌కమ్ చెప్పేందుకు సిద్దమైపోతోంది.