YSRCP_MP_Raghu_Rama_Krishna_Rajuవైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తమ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డిని, మంత్రులను, తమ ప్రభుత్వ పనితీరుపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించలేకపోతుండటంతో ఆయన వైసీపీకి పక్కలో బల్లెంలా తయారయ్యారని చెప్పవచ్చు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల మొత్తం 175 సీట్లు వైసీపీయే గెలుచుకోగలదని చెప్పడంపై ఆయన చాలా వ్యంగ్యంగా స్పందించారు.

ప్రస్తుతం ధిల్లీలో ఉన్న ఆయన అక్కడ తెలుగు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నాకు తెలిసీ మా పార్టీలో ఈసారి 120 మంది మళ్ళీ టికెట్స్ కూడా అడగరు. ఎందుకంటే, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేయించుకున్న తాజా సర్వేలో వచ్చే ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 115 సీట్లు, మా పార్టీకి 60 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. ఆయనకు మా పార్టీ వాస్తవ పరిస్థితి తెలిసి ఉన్నప్పటికీ మా ఎమ్మెల్యేలను భ్రమలో ఉంచడానికి 175 సీట్లు మన పార్టీయే గెలుచుకోగలదని చెప్పుకుంటున్నారు.

పైగా ఎన్నికలలో తన ఫోటో పెట్టుకొంటే చాలు అభ్యర్ధులు గెలిచేస్తారని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆయన వలననే వచ్చే ఎన్నికలలో మా పార్టీ ఓడిపోబోతోంది. ఒకవేళ తన ఫోటో పెట్టుకొంటే చాలు మా పార్టీ గెలుపు తథ్యం అని అయన భావిస్తున్నట్లయితే, మరి ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గడపగడపకూ ఎందుకు తిరుగుతున్నారు?అసలు ఆ అవసరం ఏమిటి?

పోనీ గడపగడపకూ తిరుగుతున్నా వారికి ప్రజలేమైనా పూలదండలు వేసి, మంగళహారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలుకుతున్నారా? అంటే అదీ లేదు. ఎక్కడికక్కడ ఛీత్కారాలు, నిలదీతలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ ఒక్క కార్యక్రమం చాలు… వారికి కూడా మా పార్టీ అసలు పరిస్థితి అర్ధం కావడానికి!

అయినా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మా పార్టీకి కేవలం మూడేళ్ళలోనే ఇటువంటి దుస్థితి ఎందుకు ఎదురవుతోంది? అంటే అంటే తుగ్లక్ పాలన… తుగ్లక్ వాలంటీర్ వ్యవస్థలే కారణంగా కనిపిస్తున్నాయి. తొలి రోజు నుంచే చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ సిఎం జగన్మోహన్ రెడ్డి మా పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేసుకున్నారు.

తుగ్లక్ వ్యవస్థ వంటి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజలతో ప్రత్యక్ష సంబందాలు తెగిపోయి దూరం అయ్యారు. అందుకే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళితే వాళ్ళను ప్రజలు గుర్తుపట్టడం లేదు. వారికి ప్రజల నుంచి నిరాదారణ ఎదురవుతోంది.

ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి తాను, తన ప్రభుత్వం పాస్ అయ్యామని అనుకొంటే మరి ఎమ్మెల్యేలు ఎలా ఫెయిల్ అవుతారు? ఒకవేళ వారు కూడా పాస్ అయ్యుంటే గడపగడపకు కార్యక్రమంలో ఎందుకు ప్రజల నుంచి అంతగా వ్యతిరేకత వస్తోంది?” అని రఘురామ ప్రశ్నించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఎంత కాలం కొనసాగితే అంత మంది సాక్షులు తగ్గిపోతారని చివరికి ఒక్కరు కూడా మిగలకపోవచ్చునని అన్నారు. ఈ కేసులో మరో ప్రధాన సాక్షి గంగాధర్ రెడ్డి చనిపోవడమే ఇందుకు తాజా నిదర్శనమని అని రఘురామ అన్నారు.