Kotamreddy Sridhar Reddyనెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మౌనంగా పార్టీ నుంచి బయటకు పోవాలనుకొన్నా వైసీపీ నేతలు ఆయనని పోనిచ్చేట్లు లేదు. ప్రభుత్వం తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించిందనే ఆరోపణలని వారు ఖండించి ఊరుకొంటే సరిపోయేది. కానీ వైసీపీ నేతలు మూకుమ్మడిగా ఎదురుదాడులు చేస్తుండటంతో ఆయన కూడా ప్రెస్‌మీట్‌లు పెట్టి ధీటుగా స్పందిస్తున్నారు. దీంతో ఆయనకి జరుగుతున్న నష్టం కంటే వైసీపీకి, ప్రభుత్వానికి, వైసీపీ నేతలకి జరుగుతున్న నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది.

వైసీపీ నేతలు తమంతట తామే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తున్నారా లేదా తమ అధినేత ఆదేశం మేరకు చేస్తున్నారా?అనేది పక్కన పెడితే వారి అత్యుత్సాహంతో వారి కొంపలే మునగబోతున్నాయని చెప్పవచ్చు. రేపు ఎప్పుడైనా తాము పార్టీ వీడితే తమకీ ఇటువంటి దుస్థితే ఎదురవుతుందనే విషయం మరిచి, వైసీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోటాపోటీగా ఎదురుదాడి చేస్తున్నారు. ఆయన ఇప్పటికే అనిల్ కుమార్‌ యాదవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, కాకణి గోవర్ధన్ రెడ్డి, కొడాలి నాని వంటి వారి గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో ఇసుక, మద్యం మాఫియా జరుగుతోందని, అక్రమంగా కోట్లు వెనకేసుకొంటున్నారని, కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకపోవడం వలన అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకలు నడుస్తున్నాయంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేత ఇంకా మాట్లాడిస్తే మిగిలిన వారి భాగోతాలు కూడా ఆయన బయటపెడతారు. కనుక ఆయన కంటే వారే ఎక్కువ నష్టపోతారని అర్దం అవుతోంది.

చిరకాలంగా వైఎస్సార్ కుటుంబంతో అనుబందం కలిగి, వైసీపీలో సీనియర్ నాయకుడైన ఆయన చేస్తున్న ఆరోపణలని వైసీపీ నేతలు తేలికగా కొట్టిపారేస్తున్నా అవి ప్రజలకి సరిగ్గానే చేరుతున్నాయి. ఆయన నియోజకవర్గంలో ఒంటరిని చేయాలని వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీంతో ఆయన కూడా నియోజకవర్గంలో తన క్యాడర్ చెదిరిపోకుండా జాగ్రత్తపడక తప్పడం లేదు.

ఈరోజు ప్రెస్‌మీట్‌లో ఆయనకి మద్దతుగా నెల్లూరు రూరల్ మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త పాల్గొన్నారు. తాము, తమతో పాటు పలువురు కార్పొరేటర్లు కోటంరెడ్డితోనే ఉంటామని, అవసరమైతే పదవులకి రాజీనామా చేస్తామని, కనుక వైసీపీ నేతలెవరూ తమకి ఫోన్లు చేసి ఒత్తిడి చేయవద్దని తేల్చి చెప్పేశారు. అంటే వైసీపీ నేతల అత్యుత్సాహంతో ఎటువంటి నష్టం జరుగుతుందో స్పష్టమైంది.

తాను పార్టీలో నుంచి బయటకి వచ్చినందున తనపై పోలీస్ కేసులు, వేధింపులు మొదలైపోతాయని ఆయన చెప్పిన 24 గంటలలోనే పోలీస్ కేసు నమోదవడంతో ఆయన చెప్పినవి నిజమేననే భావన ప్రజలకి కలుగడం సహజం. అంతే కాదు… నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలతో ఆయనకి చాలా బలమైన అనుబందం ఉన్నందున తమ ఎదురుదాడులతో ఆయన పట్ల ప్రజలలో సానుభూతి మరింత పెరుగుతుందనే విషయం కూడా మరిచిపోతున్నారు. కనుక ఇకనైనా వైసీపీ నేతలు తగ్గితే మంచిది. లేకుంటే కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.