YCP fans don't put yourself at risk వైసీపీ అభిమానులు, నేత‌లు చేస్తున్న ప‌నులు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి. అంతే కాకుండా ఇప్ప‌టికే వివాదాస్ప‌ద కామెంట్ల‌తో వారు కూడా ఇబ్బంది ప‌డుతూనే ఉన్నారు. గ‌తంలో కోర్టుల తీర్పుల మీద సోష‌ల్ మీడియాలో ఇలాంటి పోస్టులే చేసి స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నారు. కాగా ఇప్పుడు కూడా తీరు మార్చుకోకుండా అన‌వ‌స‌రంగా కోర్టు తీర్పుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వానికి ఇప్ప‌టికే చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అటు వివేకా హత్య కేసు మీద సీబీఐ దూకుడు వైసీపీని ఇరకాటంలో పెడుతున్నాయి. ఇక మూడు రాజధానులు విషయంలో నిన్న కేంద్రం షాక్ ఇచ్చింది. అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ సచివాలయం నిర్మాణానికి నిధులు కూడా విడుదల చేసింది. ఈ రోజు హైకోర్టు అమరావతిలో రాజధాని పనులు షురూ చేయాలని ఆరు నెలల్లోపు రైతుల ఫ్లాట్లు డెవలప్ చేసి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు తీర్పులపై కూడా వైసీపీ అభిమానులు, నేతలు విచ్చ‌ల‌విడిగా విమ‌ర్శ‌లు చేయ‌డం సంచలనంగా మారింది.

కోర్టు తీర్పుపై చాలామంది వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అయితే కోర్టు తీర్పును తప్పు పడుతున్నారు. కోర్టు తమకు కావాల్సిన పిటిషన్ల పైన తీర్పు ఇస్తున్నాయని, తాము ఎప్పటి నుంచో వేసిన పిటిషన్లను మాత్రం అలాగే పెండింగ్లో ఉంచాయంటూ వాపోతున్నారు. రాష్ట్ర విభజన పిటిషన్ తో పాటు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదంటూ తాము వేసిన పిటిషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని చెబుతున్నారు.

అయితే వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఏకంగా కోర్టుల తీర్పులను తప్పుబట్టే స్థాయిలో వారి వ్యవహారం ఉందంటూ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు చాలా మంది సోషల్ మీడియాలో కోర్టుల‌కు వ్యతిరేకంగా మాట్లాడి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఏకంగా హైకోర్టు తీర్పును తప్పుపట్టడం మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుందంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు సీబీఐ కేసులు కూడా నడుస్తున్న సమయంలో జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే విధంగా వైసీపీ నేతలు కామెంట్ చేయడం గమనార్హం. ఇప్పటికైనా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలను పక్కనపెట్టి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు.