YCP BJP fighting in Gully but Friendship in Delhiఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తీరు, పరిస్థితి నేటికీ అయోమయంగానే ఉంది. రాష్ట్ర స్థాయిలో వైసీపీతో సిగపట్లు పడుతుంటుంది. కానీ ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాసుకుపూసుకు తిరుగుతుంటారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి జగన్ ప్రభుత్వం అసమర్ద, అవినీతి, అప్పుల కుప్ప అని తిట్టిపోసి వెళ్ళిపోతారు. వెంటనే ప్రధాని నరేంద్రమోడీ భీమవరం వచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగి అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు.

జగన్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలో బిజెపి ధర్నాలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తుంటారు. ఇందుకు తాజా ఉదాహరణగా సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే శుక్రవారం బిజెపి యువమోర్చా అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్, కార్యదర్శి బత్తల పవన్ కుమార్‌ మాట్లాడుతూ, “తుగ్లక్ పాలన చేస్తూ రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్న ఈ జగన్ రెడ్డిని వెంటనే సాగనంపాలి లేకుంటే రాష్ట్రాన్నిపూర్తిగా ముంచేస్తాడు. ధరలు పెంచి, ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలను బతకనీయకుండా చేస్తున్నాడు. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పిన జగన్ ఇప్పుడు రాష్ట్రాన్ని మద్యంలో ముంచేస్తున్నాడు. మద్యం ఆదాయంతో జగన్ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది,” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

మరో పక్క అమరావతిని రాజధానిని చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నేతలు పాదయాత్రలు చేస్తారు. కానీ పక్కనే ఉన్న సచివాలయానికో, తాడేపల్లిలో సిఎం క్యాంప్ కార్యాలయం వైపు మాత్రం పోరు. వారు అమరావతిలో పాదయాత్రలు చేస్తుంటే, మేము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని వైసీపీ చెపుతుంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శిస్తుంటే, ప్రధాని నరేంద్రమోడీ సిఎం జగన్మోహన్ రెడ్డి అడిగిందే తడువు అపాయింట్మెంట్ ఇచ్చి నెలనెలా టంచనుగా అప్పులు ఇప్పిస్తూనే ఉంటారు. అందుకు కృతజ్ఞతగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకి వైసీపీ బేషరతుగా మద్దతు ఇచ్చి గెలిపించింది.

బిజెపి-జనసేన మిత్రపక్షాలుగా సాగుతున్నాయి. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే బిజెపి-వైసీపీలు కూడా లోపాయికారిగా పరస్పరం సహకరించుకొంటూ మిత్రపక్షాలుగానే సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. కనుక వచ్చే ఎన్నికలలో బిజెపి జనసేన వైపు ఉంటుందా లేక వైసీపీ ఉంటుందా?అనేది పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడే తేల్చుకోవడం మంచిది. ద్వంద వైఖరితో వ్యవహరిస్తున్న బిజెపి వలన రాష్ట్రానికే కాదు జనసేనకి కూడా నష్టం కలుగుతోందని పవన్‌ కళ్యాణ్‌ గ్రహిస్తే మంచిది. ఏపీ ప్రజలు కూడా బిజెపి ద్వంద వైఖరిని నిశితంగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది.