YS-Jagan-Yarlagadda-Lakshmi-Prasadడాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ వైసీపీ ప్రభుత్వం నేడు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. టిడిపి సభ్యులు దీనిని ఉభయసభలలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. వారందరినీ సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేసి, యూనివర్సిటీ పేరు మార్చాలనే నిర్ణయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగా సమర్దించుకొని, పనిలో పనిగా ఇటువంటి గొప్ప ఆలోచన చేసిన తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డిని పోటీలు పడి పొగుడుతారు. తర్వాత యూనివర్సిటీ పేరు మార్చుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారు.

అయితే వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కొద్ది సేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. తెలుగు భాష, ఆత్మగౌరవం, కళల కోసం తపించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అటువంటి మహనీయుడి పేరును తొలగించై వైఎస్సార్ పేరు పెట్టడం తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు. అందుకే నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శాసనసభలోనే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన మన ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించడం సరికాదన్నారు.

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “సంస్థలకు పెట్టిన పేర్లను మార్చగలరేమో కానీ వారి గొప్పదనాన్ని, చరిత్రను ఎవరూ మార్చలేరు. రాజకీయ కక్షల కోసం ఇలా ఎంతకాలం పేర్లు మార్చుకొంటూ పరిపాలిస్తారు? ఇవేనా ప్రభుత్వం చేయవలసిన పనులు? ఎన్టీఆర్ అర్దాంగినని చెప్పుకొంటున్న లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పుకొనే మాజీ మంత్రి కొడాలి నాని ఇద్దరూ దీనిపై ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టాము.

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్‌తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోంది.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం..ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది?కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా?అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌కు ఏం సంబందం ఉంది?దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా…ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలి,” అని ట్వీట్ చేశారు.