Yanamala Ramakrishnudu comments on YS Jaganతన ఒంటి నిండా బురద ఉంచుకుని, పక్క వాడి ఒంటిపై బురద ఉందని హేళన చేయడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ చేస్తోంది కూడా అదే! పూర్తిగా అవినీతి కేసుల్లో కూరుకునిపోయి, ఇప్పటికే కొన్ని వేల కోట్లను ఈడీ జప్తు చేయగా, వాటికి ఏ మాత్రం సమాధానం చెప్పని జగన్, మరో వైపు టిడిపిపై అవినీతి విమర్శలు చేస్తుండడంతో… అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ‘సాక్షి’ వేదికగా జగన్ చేస్తోన్న తప్పుడు ప్రచారాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘సాక్షి’ మీడియాకు యాడ్స్ ఇచ్చే విషయమై ఇకపై పునఃసమీక్షించాలని భావిస్తున్నామని, ప్రెస్ కౌన్సిల్ గైడ్ లైన్స్, జర్నలిజం విలువలు పాటించని ‘సాక్షి’ మీడియాకు ఈ రోజు వరకూ యాడ్స్ ఇచ్చామని, ఇకపై ఆలోచిస్తామని అన్నారు. ‘సాక్షి’ మీడియా ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడిన యనమల, ఉద్యోగులు, అర్చకుల జీతాలు తగ్గిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, అందుకు తగిన ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల కోసమే తమ మీడియాను వినియోగించుకోవడం సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు.

ఇక, వైసీపీ అధినేత జగన్ గురించి ప్రస్తావిస్తూ… ఒక్క ప్రతిపక్ష నేత గానే కాదు, అసలు, రాజకీయాలకే ఈయన తగడని విమర్శించారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేయడంలో హిట్లర్, గోబెల్స్ ను జగన్ మించిపోయాడని విమర్శించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల జప్తు చేసిన 18 వేల కోట్లు జగన్ కు ఎక్కడి నుంచి వచ్చాయని, వాటి గురించి జగన్ ఎందుకు మాట్లాడరని, ఎందుకు మీడియా ముఖంగా సమాధానం చెప్పరని ప్రశ్నించారు. అయితే జగన్ విషయంలో కొత్తగా తెలియాల్సింది కూడా ఏమీ లేదులే… అనుకోవడం ప్రజల వంతవుతోంది…!