Yalamanchili Ravi Joining YSRCP2014 ఎన్నికలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కృష్ణా జిల్లాలో ఘోరంగా దెబ్బతింది. తరువాత జగన్ చాలా కష్టపడినా పార్టీ జిల్లాలో బలపడలేదు. జగన్ పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో జరుగుతుంది. ఈ వారంలో కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం తెదేపాలో ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైకాపాలో చేరడానికి సిద్ధం అవుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రవిని తన కార్యాలయానికి పిలిపించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా చంద్రబాబు నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు వైకాపాలో చేరేందుకు రవి నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌తో సోమవారం రవి ఏకాంతంగా భేటీ అయ్యారు.

‘మీరు పార్టీలోకి వస్తారనుకోలేదని, వచ్చినందుకు కృతజ్ఞతలని’ జగన్‌ అన్నారు. నియోజకవర్గం వైకాపా సీటుకు ఆశావాహులు చాలా మంది ఉన్నా యలమంచిలి రవికి ఆ సీటు ఇవ్వడానికి జగన్ అంగీకరించినట్టు సమాచారం. పాదయాత్ర ఈ నెల 14న విజయవాడ చేరనున్న నేపథ్యంలో జగన్‌ సమక్షంలో ఆయన వైకాపాలోకి చేరుతున్నట్లు సమాచారం. ఈ చేరికతో అయినా కృష్ణా జిల్లాలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ భాగ్యరేఖలు మారతాయా? అనేది చూడాలి.