Writer Padmabhushanతమిళంతో పోల్చుకుంటే మన ప్రేక్షకులకు కలర్ పట్టింపు ఎక్కువ. అందుకే కోలీవుడ్ లో విజయ్ కాంత్, విజయ్ సేతుపతి, మురళి లాంటి వాళ్ళు శరీర ఛాయతో సంబంధం లేకుండా స్టార్లుగా ఎదిగారు. కానీ ఇక్కడలా కుదరదు. తెలుగు ఆడియన్స్ కి హీరో అందంగా ఉంటేనే ఒప్పుకుంటారు. స్వర్గీయ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి మహేష్ బాబు దాకా ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా ఇదే ఋజువవుతుంది. అలా అని రంగు తక్కువగా ఉన్న వాళ్ళు రాణించలేదా అంటే లేకేం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్లుగా బ్రహ్మాండమైన కెరీర్ అనుభవించిన వాళ్ళు ఎందరో. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ లాంటి లెజెండ్స్ ఉదాహరణలుగా నిలుస్తారు.

సుహాస్ దీనికి ఎదురు నిలిచి హీరోగా తన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కలర్ ఫోటోలో కథ ప్రకారమే అలా చూపించినా అతని సహజత్వం అది హిట్ కావడంలో కీలక పాత్ర పోషించింది. ఆది ఓటిటి రిలీజ్ కాబట్టి తన మార్కెట్ కెపాసిటీ గురించి అవగాహన రాలేదు. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ తో థియేటర్లలోకి వచ్చాడు. రివ్యూస్ పర్లేదన్నాయి. యూత్ ఎంజాయ్ చేశామంటున్నారు. ఫ్యామిలీస్ ఎమోషనలైనట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. ఇంత సానుకూల వాతావరణం ఉన్నప్పుడు హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. కాకపోతే ఏ రేంజ్ అనేది ఇంకొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు.

రైటర్ పద్మభూషణ్ సింపుల్ కామెడీ, బరువైన ఎమోషన్లతో సాగే ఒక చక్కని కథ. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే హై మూమెంట్స్ ఉండవు. కానీ చూసిన ఒక్కసారి అసంతృప్తికి గురి కానివ్వకుండా ఎంటర్ టైం చేసే కంటెంట్ ని జొప్పించారు. క్లైమాక్స్ లో మంచి భావోద్వేగాలు కలిగించే ఎపిసోడ్ పెట్టారు. ఇంకేం కావాలి. వినోదమంటే మరీ బొమ్మరిల్లు, నిన్నే పెళ్లాడతా రేంజ్ లో ఆశించలేం కదా. ఉన్నంతలో ఈ మధ్య కాలంలో ఈ మాత్రం టైం పాస్ చేయించినవి తక్కువే. అలాంటప్పుడు రైటర్ తన మీద ఎక్కువ వంకలు రాకుండా చూసుకున్నాడు. సరే ఓసారి చూస్తే నష్టమేమీ లేదనే టాక్ జనం నుంచి తెచ్చుకున్నాడు.

అలా అని ఆల్ ఈజ్ వెల్ కాదు. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ సెకండ్ హాఫ్ లో తడబడ్డాడు. రెండో హీరోయిన్ కి ట్విస్ట్ ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని విస్తరించే క్రమంలో రొటీన్ గా అలోచించి అదంతా సోసో అనిపించాడు. కారణం ఆ గ్యాప్ లో పడాల్సిన స్ట్రాంగ్ కంటెంట్ చేతిలో లేకపోవడమే. భోజనంలో ఉప్పు తగ్గిన సాంబార్ కంప్లయింట్ ని ఆఖరున మీగడ పెరుగుతో కవర్ చేసినట్టు చివరి ఘట్టంతో మేనేజ్ చేసి పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. అయితే రైటర్ కి ఈ మీటర్ సరిపోతుందా అంటే ఇప్పటికి ఓకే కానీ భవిష్యత్తులో సుహాస్ మరింత రాణించాలంటే సంథింగ్ స్పెషల్ కావాల్సిందే. ప్రతిసారి సినిమాని ఇంత దగ్గరగా మార్కెటింగ్ చేసే నిర్మాతలు దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు మాట్లాడాల్సింది ప్రమోషన్ కాదు సినిమానే.