Guntur-Roadsఏపీలో ప్రధాన నగరాలలో గుంటూరు కూడా ఒకటి. రాజధాని అమరావతికి కేవలం 33.6కిమీ దూరంలో ఉంది. కనుక నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల రాకపోకలు సాగిస్తుంటారు. అటువంటి గుంటూరు నగరంలో రోడ్ల పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. గుంటూరులోని ప్రధాన రహదారులలో ఒకటైన పెద్దపలకలూరు రోడ్ డివైడర్ నుంచి విజ్ఞాన్ కాలేజీవరకు సుమారు 1.5 కిమీ మేర రోడంతా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. అవి ఎంత పెద్దవి అంటే ఒక్కోటి ఒక్కో చెరువును తలపిస్తున్నాయి. ఒకటిన్నర కిలోమీటర్లు పొడవుండే ఈ రోడ్డులో అలాంటి మినీ చెరువులు కనీసం ఓ 15 వరకు ఉన్నాయి. దూరం నుంచి చూస్తే వాటిని రోడ్డు మద్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కనిపిస్తాయి.

రోడ్డులో మిగిలిన చిన్నభాగం మీదుగానే వాహనాలు ప్రయాణిస్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా రెండు కాలువలు నిండిగా ప్రవహిస్తున్నాయి. కనుక ద్విచక్ర వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రోడ్డుపై ఏర్పడిన ఆ చెరువులలోనో లేదా పక్కనే పొంగి ప్రవహిస్తున్న అ మురికి కాలువలలోనో జారిపడే ప్రమాదం కనిపిస్తోంది.

మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఎగతాళి చేస్తే వైసీపీ మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రోడ్లు మరమత్తులకు నిధులు కేటాయించి వర్షాకాలం మొదలయ్యే లోపుగా యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేయాలని, అవసరమైతే కొత్త రోడ్లు నిర్మించాలని ఆదేశించారు.

వర్షాకాలం వచ్చేసింది. రోడ్ల మరమత్తులకు కేటాయించిన డబ్బంతా బహుశః ఖర్చయిపోయే ఉంటుంది. కానీ గుంటూరులో ఈ రోడ్డును చూస్తే ‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషంట్‌ డెడ్’ అన్నట్లుంది. అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరులో ఓ ప్రధాన రహదారి పరిస్థితి ఈవిదంగా ఉందంటే, రాష్ట్రంలో చిన్న పట్టణాలు, గ్రామాలలో ఏవిదంగా ఉన్నాయో?