World Bank stops funding Capital Amaravatiరాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వబోమని ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. సుమారు రూ.7,200 కోట్ల రుణం ప్రతిపాదనను తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకుంది. తొలి దశలో రూ.3,600 కోట్లు, రెండో దశలో మరో రూ.3,600 కోట్లు బ్యాంకు నుంచి తీసుకోవాలనేది తొలుత ప్రతిపాదన. బ్యాంకు కూడా సూత్రప్రాయంగా ఆమోదించింది. అయితే ఇప్పుడు ‘అమరావతి సస్టెయినబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌’ని బ్యాంకు వెబ్‌సైట్‌లో ‘డ్రాప్డ్‌’ ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది.

దీనితో అమరావతి నిర్మాణం అనేదే డోలాయమానంలో పడింది. అయితే దీనికి కారణం ఏమిటంటే… కొంత కాలం క్రితం అమరావతి వల్ల తమ అస్తిత్వానికే ముప్పు అని కొందరు రైతులు ప్రపంచబ్యాంకుకు ఈమెయిల్స్ పంపారు. అప్పట్లో వారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో ఈ పని చేశారని అప్పటి ప్రభుత్వం విచారణలో తేల్చింది. దానితో రాజధానికి రుణం ఇవ్వాలంటే పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానెల్‌ స్పష్టంచేసింది.

దానికి ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని నేపథ్యంలో రుణం ప్రతిపాదనను విరమించుకుంది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉందని సమాచారం. రాజధానికి రుణం కావాలంటే వేరే మార్గంలో చూద్దామని, ప్రపంచబ్యాంకు తనిఖీకి అంగీకరిస్తే, ఆ ప్రభావం బ్యాంకు ఆర్థిక సాయంతో దేశంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టులపైనా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.