చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను సర్వ నాశనం చేస్తుంది. పేదా, ధనిక అనే తేడాల్లేకుండా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. ఈ వైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండున్నర లక్షల మంది బాధితులుగా మారారు. దాదాపుగా ఆరు లక్షల మంది మృత్యు వాత పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భూమ్మీద సగం జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు.

వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తుండడంతో వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆయా సంస్థలు ఆదేశిస్తున్నాయి. అత్యవసర విభాగాల్లో పని చేసేవారు తప్ప మిగతా ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.

గతంలో తమ దగ్గర పని చేసే వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడానికే భయపడే సంస్థలు ఇక ముందు వర్క్ ఫ్రం హోమ్ అనేది పెర్మనెంట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. “కరోనా ప్రభావంతో సంస్థలు పొదుపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దీనితో ఆఫీసు స్పేస్ తగ్గించే దిశగా తమ దగ్గర పనిచేసే వారిలో కనీసం 50% మందికి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారు,” అని నిపుణులు అంటున్నారు.

50% వర్క్ ఫోర్స్ ఆఫీసులకు రాకపోతే ఆఫీస్ స్పేస్ అవసరం మరియు వారికి ఆఫీసులలో ఇచ్చే సదుపాయాలు ఆదా అవుతాయి. ఆర్ధిక మాంద్యం కారణంగా ఉద్యోగులు కూడా ఇంట్లో నుండి కూడా శ్రద్దగానే పని చేస్తారని కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే కరోనా పని చేసే విధానంలోనే పెను మార్పులు తెచ్చినట్టే.