women-questions-ambati-rambabu-ysrcp-gadapagadapaku-ఎప్పుడూ కార్యాలయంలో కూర్చొని సాక్షి మీడియాను పెట్టుకొని చంద్రబాబు నాయుడుని, టిడిపి నేతలను టీటీపోస్తూ కాలక్షేపం చేసే మంత్రి అంబటి రాంబాబుకి ఈరోజు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా రాజుపాలెంలో పర్యటించినప్పుడు గడప గడపకి మహిళలు తిట్లు, శాపనార్ధాలతో మంత్రి అంబటిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్షేమ పధకాల గురించి గొప్పగా చెప్పుకొందామని అధికారులు, పోలీస్ సిబ్బందిని వెంటపెట్టుకొని వెళ్ళిన మంత్రి అంబటి రాంబాబు ఊహించిన ఈ పరిణామంతో షాక్ అయ్యారు.

ఒక దివ్యాంగురాలి ఇంటికి వెళ్ళి పలకరించగా మూడేళ్ళుగా తనకు పింఛను రావడం లేదని చెప్పుకొని బాధపడింది. పక్కనే ఉన్న అధికారులు ఆమె ఇంటికి నాలుగు విద్యుత్ కనెక్షన్లు ఉన్నందున నిబందనల ప్రకారం పింఛను ఇవ్వలేమని చెప్పారు. అదే విషయం మంత్రి అంబటి ఆమెకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అది చూసి మంత్రి అంబటి షాక్ అయ్యి అక్కడి నుంచి ముందుకు కదిలారు. సమాధానం చెప్పకుండా వెళ్లిపోతున్న మంత్రి అంబటిని చూసి ఆమె మరింత రెచ్చిపోయి శాపనార్ధాలు పెడుతుండటంతో మంత్రి వెంట ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆమెను వారించే ప్రయత్నం చేశారు కానీ ఆమె ఆగ్రహం చల్లార్చలేకపోయారు.

ఇలాగే రెండు మూడు చోట్ల చేదు అనుభవాలు ఎదురైన తరువాత మంత్రి అంబటి ఓ ఇంట్లో వ్యక్తిని పలకరించగా ‘ఇంటి పన్ను, చెత్తపన్నుఅన్నీ కడుతున్నాము సార్. మా కాలనీకి రోడ్ వేయించండి సార్,’ అని అడిగాడు. మంత్రి పక్కన ఉన్న అధికారి అతను తెలుగుదేశం పార్టీకి చెందినవారని చెప్పడంతో, “తెలుగుదేశం వాళ్ళు అడిగితే రోడ్లు వేయించేస్తామేమిటి?” అంటూ ముందుకు సాగిపోయారు.

సంక్షేమ పధకాలు ఇస్తున్నాము గనుక ప్రజలు మాకు బ్రహ్మరధం పట్టి వచ్చే ఎన్నికలలో 175 సీట్లు కట్టబెట్టేస్తారనే భ్రమలో ఉన్న సిఎం జగన్మోహన్ రెడ్డికి, ఆయనకి వంతపాడే అంబటి రాంబాబు వంటి మంత్రులకు ఈ గడప గడపకి కార్యక్రమం కనువిప్పు కలిగిస్తే మంచిదే.