Woman gang-raped at Repalle railway stationఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను చూసి వైసీపీ ప్రభుత్వం ఏమనుకొంటుందో తెలీదు కానీ ప్రజలు మాత్రం సిగ్గుతో తలదించుకొంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఓ మహిళ (తానేటి వనిత) హోం మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుండటం చాలా బాధాకరం.

తాజాగా శనివారం అర్ధరాత్రి రేపల్లె రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారం మీదనే నాలుగు నెలల గర్భిణిపై ఆమె భర్త, ముగ్గురు పిల్లల ఎదుటే ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆమె భర్త రైల్వే స్టేషన్‌లో రైల్వేపోలీసుల సాయం కోసం కేకలు వేసినా వారు సాయం చేయకపోవడంతో స్టేషన్ బయట ఉన్నవారి సాయం అర్ధించాడు. వారూ పట్టించుకోకపోవడంతో అతను పరుగున రేపల్లె పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఈవిషయం చెప్పగా వారు వెంటనే అక్కడకు చేరుకొని అతని భార్యపై ఇంకా అత్యాచారం చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు.

అతను చెప్పిన సమాచారంతో మిగిలిన ఇద్దరు నిందితులను కూడా గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ముగ్గురూ పాత నిందితులే అని గుర్తించి వారిపై సెక్షన్స్ 376,394,307,34 కింద కేసులు నమోదు చేసి బాధితురాలికి వైద్య పరీక్షలు, చికిత్స కొరకు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఇప్పటికే ఈ దారుణ ఘటన గురించి అందరికీ తెలిసే ఉంటుంది కనుక బాధాకరమైన ఆ విషయాలు మళ్ళీ చెప్పుకొనవసరం లేదు.

విజయవాడ ఆస్పత్రి ఘటనలో పోలీసులు నిర్లక్ష్యం చూపగా, రేపల్లె ఘటనలో రైల్వే పోలీసులు నిర్లక్ష్యం వలన మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఈసారి పోలీసులు సత్వరమే స్పందించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయడం కాస్త ఊరటనిచ్చే విషయం.

అయితే ఇటువంటి నేరాలు జరిగిన్నప్పుడు, ప్రభుత్వం వెంటనే బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేసి, నిందితులను అరెస్ట్ చేసి, బాధితులకి ఆర్ధిక సాయం అందించిడంతో ప్రభుత్వం తన బాధ్యత చాలా ‘సమర్ధంగా’ నిర్వర్తించానని భావిస్తున్నట్లుంది. కానీ ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా అదనంగా ఇంకా ఏమేమి చర్యలు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు మంత్రులు ఎవరూ మాట్లాడిన దాఖలాలు లేవు. ఇటువంటి నేరాలు-ఘోరలపై ప్రతిపక్షాలు నిలదీస్తే వాటిని ఏవిదంగా ఎదుర్కోవాలనే వైసీపీ మంత్రులు ఆలోచిస్తుంటారు తప్ప ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు కనబడదు. వ్యవస్థ పనిచేయనప్పుడు అది ఎంత బలమైనదైతే మాత్రం ఏమి ప్రయోజనం?