Woman Attempts Suicide at YS Jagan's Camp Officeక్లుప్తంగా ఇదీ… ఓ తల్లి కన్నీటి గాధ! కాకినాడ గ్రామీణ మండలంలోని రాయుడుపాలెంకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళకు సాయిలక్ష్మి అనే వికలాంగురాలైన కుమార్తె ఉంది. ఆమెకు వెన్నెమ్ముక దెబ్బతినడంతో సొంతంగా ఏ పనులు చేసుకోలేదు. వీల్ ఛైర్మన్‌ లేదా మంచానికే పరిమితం. పూర్తిగా తల్లి మీదే ఆధారపడి జీవిస్తోంది.

ఆమెను కాపాడుకొనేందుకు ఉన్నవన్నీ అమ్ముకొని మూడుసార్లు ఆపరేషన్ చేయించానని కానీ కూతురు ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని ఆరుద్ర చెప్పారు. ఆమెకు మరో శస్త్ర చికిత్స చేయిస్తే తప్పకుండా కొలుకొంటుందని, దానికి సుమారు రెండు కోట్లు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారని ఆరుద్ర తెలిపారు. స్పందన కార్యక్రమంలో తన కూతురిని వెంటబెట్టుకొని అధికారులకు వినతి పత్రం ఇవ్వగా దానిని వారు తమ పై అధికారులకు పంపించారని తెలిపారు. కానీ వైద్య ఖర్చులో 20-30 శాతం మాత్రం ఇచ్చేందుకు సీఎంవో అంగీకరించిందని చెప్పారని ఆరుద్ర తెలిపారు.

తన వద్ద అంత డబ్బులేకపోవడంతో తన ఇంటిని అమ్ముకోవడానికి సిద్దపడగా ఒకరు రూ.40 లక్షలకు దానిని కొనేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కానీ తన ఇంటి పక్కనే నివాసం ఉంటున్న మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌ అడ్డుపడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిని అమ్మితే తనకే పది లక్షలకు అమ్మాలని లేకుంటే ఎవరినీ కొననీయనని బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. ఇదే విషయం పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తమకు సాయం అందించమని ఎంతగా ప్రార్ధిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సహాయం అందకపోగా కనీసం ఇల్లు అమ్ముకొని కూతురికి వైద్యం చేయించుకొందామన్నా అమ్ముకోనీయకుండా మంత్రి గన్‌మెన్‌ అడ్డుపడుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక గత్యంతరం లేని పరిస్థితిలో కుమార్తెను వీల్ చైర్‌లో కూర్చొబెట్టుకొని ఈరోజు తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డినే కలిసి మొరపెట్టుకోవాలనుకొంటే, ఆయన విజయవాడలో ఓ కార్యక్రమానికి వెళ్ళారని చెప్పారని ఆరుద్ర తెలిపారు. దాంతో కుమార్తెను వెంటపెట్టుకొని అక్కడికి చేరుకొంటే అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సిఎంను కలవాలంటే స్థానిక ఎమ్మెల్యేను వెంటబెట్టుకొని రావాలని అధికారులు సూచించారని ఆమె చెప్పారు. వికలాంగురాలైన కుమార్తెను వీల్ చైర్‌లో కూర్చొబెట్టుకొని ఇంకా ఎందరి చుట్టూ తిరగగలను… ఎలా తిరగగలను?అంటూ ఆరుద్ర కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎంతగా వేడుకొన్నా సెక్యూరిటీ సిబ్బంది సిఎంను కలిసేందుకు అనుమతించకపోవడంతో ఆమె ఆవేశం పట్టలేక అక్కడే బ్లేడుతో మణికట్టుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పోలీస్ సిబ్బంది ఆమెను అంబులెన్సులో హాస్పిటల్‌కు తరలించారు.

గత మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వంలో ఓ మాతృమూర్తి, వికలాంగురాలైన ఆమె కుమార్తె దయనీయ పరిస్థితి ఇది. కానీ జగనన్న తెల్లారిలేస్తే నా అక్కమ్మలు, చెల్లెమ్మలు, అవ్వలు, తాతలు అంటూ తీయతీయగా కబుర్లు చెపుతుంటారు. బటన్ నొక్కి వేలకోట్లు పంచిపెట్టేస్తూనే ఉంటారు. కానీ వికలాంగురాలైన కూతురిని వీల్ చైర్‌లో కూర్చొబెట్టుకొని తన గుమ్మం ఎదుట సాయం కోసం ఆర్ధిస్తున్న ఈ మాతృమూర్తిని చూడలేకపోతున్నారు. ఇకనైనా సిఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని ఆమెకు న్యాయం చేయగలిగితే బాగుంటుంది.