Will YCP and TDP get headaches with KCR's new partyతెలంగాణ సిఎం కేసీఆర్‌ జాతీయ పార్టీని ఏర్పాటుచేసుకొంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 5 మధ్యాహ్నం 1.19 గంటలకు దాని ముహూర్తం కూడా ఖరారు చేసుకొన్నారు. ఆయన జాతీయ పార్టీ పెడితే ముందుగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపైనే దృష్టి పెడతారని ముందే చెప్పుకొన్నాము. ఇప్పుడు అదే జరుగబోతోంది.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఇప్పటికే రాష్ట్రంలో యాదవ సంఘాలతో మంచి పరిచయాలున్నాయి. ఆయన ఆ వర్గానికి చెందిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే కేసీఆర్‌ మంత్రులలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒకరిద్దరు ఏపీలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో టచ్చులో ఉన్నట్లు సమాచారం. ఇక కేసీఆర్‌ స్వయంగా కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను ఏపీలో తన జాతీయపార్టీకి ఇన్‌చార్జ్ గా నియమించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్‌ స్వయంగా ఏపీలోని వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ద్వారా రాష్ట్రంలో ముస్లిం నేతలను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వీలైతే వచ్చే ఎన్నికలలో మజ్లీస్ మద్దతు ప్రకటించిన అభ్యర్ధులను కేసీఆర్‌ జాతీయపార్టీ తరపున కర్నూలు, గుంటూరు జిల్లాలో పోటీ చేయించే అవకాశం కూడా ఉంది.

కేసీఆర్‌ పార్టీకి జాతీయపార్టీగా ఎన్నికల గుర్తింపు లభించాలంటే కనీసం నాలుగైదు రాష్ట్రాలలో ఆ పార్టీ తరపున లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసి కనీసం నలుగురు ఎంపీలను గెలిపించుకోవాలి. అలాగే కనీసం ఆరు శాతం ఓట్లు లభించాలి. ఇంకా ఇటువంటి మరికొన్ని షరతులున్నాయి. కనుక ఎక్కడో దూరంగా ఉండే ఉత్తరాది రాష్ట్రాలలో పోటీ చేసి భంగపడేకంటే, మంచి పరిచయాలున్న ఏపీలో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో పోటీ చేయడమే మేలని సిఎం కేసీఆర్‌ భావించడం సహజమే.

కనుక ఈ మూడు రాష్ట్రాలపైనే ముందుగా ఫోకస్ పెడుతూ పార్టీని బలోపేతం చేసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీలో కలిసివచ్చే పార్టీలతో బహిరంగసభ నిర్వహించిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలను కలుపుకొంటూ పార్టీని విస్తరించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

టిడిపి, వైసీపీ పార్టీల మద్య మారలేక, వేరే ప్రత్యామ్నాయంగా కోసం ఎదురుచూస్తున్న నేతలకి కేసీఆర్‌ స్థాపిస్తున్న ఈ కొత్త పార్టీ ఆ అవకాశం కల్పించబోతోంది. కేసీఆర్‌ వంటి బలమైన నాయకుడి పార్టీలో ఉంటే వారికీ మంచిదే. కనుక కేసీఆర్‌ కొత్త పార్టీతో వైసీపీ, టిడిపి రెంటికీ కొత్త సమస్యలు, కొత్త సవాళ్ళు తప్పకపోవచ్చు.