Ram Charan Vegan‘మెగా’ వారసుడుగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్, ఇప్పటివరకు నటించిన సినిమాలతో తనకంటూ సొంత ఇమేజ్ ను సృష్టించుకోలేకపోయారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ మినహా, నటుడిగా రామ్ చరణ్ కు పెద్దగా పేరు తెచ్చి పెట్టిన సినిమాలు లేవు. దానికి తోడు గత రెండు చిత్రాలు ‘గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్ లీ’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందిపుచ్చుకోలేకపోవడంతో… ప్రస్తుతం పక్కా హిట్ కోసం ఒక రీమేక్ ను ఎంచుకున్నాడు చెర్రీ.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టిల్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా రీమేక్ కావడంతో గ్యారెంటీ హిట్ గా మెగా అభిమానులు అంచనా వేస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం షూటింగ్ పూర్తయితే, సెప్టెంబర్ 30వ తేదీన ఈ “ధృవ” సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో చెర్రీ లుక్ కాస్త వినూత్నంగా ఉండబోతుందని ఇటీవల సందడి చేసిన స్టిల్స్ చెప్పాయి.

ఇదిలా ఉంటే… తాజాగా మరొక వార్తను బయటపెట్టారు ‘సూపర్ హిట్’ అధినేత బిఏ రాజు గారు. త్రివిక్రమ్ – రామ్ చరణ్ కాంభినేషన్లో ఓ సక్సెస్ ఫుల్ నిర్మాత సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ట్వీట్ చేసారు. ఇప్పటికే దిల్ రాజు – త్రివిక్రమ్ కాంభినేషన్లో ఒక సినిమా ప్రకటన వెలువడడంతో, ఈ సినిమాలో చెర్రీనే హీరో అన్న వార్త ప్రచారం జరుగుతోంది. నిర్మాత ఎవరైనా… త్రివిక్రమ్ – రామ్ చరణ్ జోడి అయితే దాదాపుగా ఖరారైంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

త్రివిక్రమ్ తో సినిమా అంటే ఆ హీరో కెరీర్ మరో మలుపు తీసుకున్నట్లే! ‘అతడు’తో మహేష్ ను, ‘జల్సా’తో పవన్ ను, ‘జులాయి’తో అల్లు అర్జున్ ను… తాజాగా ‘అ…ఆ…’ సినిమాతో నితిన్ కెరీర్ లను మార్చివేసిన ఘనత త్రివిక్రమ్ ది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ ను ఏర్పరచడం అందరి హీరోలకు త్రివిక్రమ్ సినిమాతో మొదలవుతోంది. ఎలాంటి స్టార్ హీరోలు లేకపోయినా యుఎస్ బాక్సాఫీస్ వద్ద నితిన్ చేత రచ్చ రచ్చ చేయిస్తున్నాడు ఈ ‘మాటల మాంత్రికుడు.’ ఇదే క్రమంలో చెర్రీకి భారీ బ్రేక్ రావడం అన్న ఆశతో ఉన్నారు మెగాభిమానులు.