Kotla Jayasurya- Prakasha Reddy TDPకర్నూల్ జిల్లా అంటే వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు పెట్టని కోట. జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉండగా 2014 ఎన్నికలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు ఏకంగా 11 సీట్లు దక్కాయి. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు సీట్లే దక్కాయి. ఇప్పుడు కర్నూల్ కోటను బద్దలు కొట్టడానికి చంద్రబాబు నాయుడు పావులు కలుపుతున్నారు. ఇప్పటికే భూమా కుటుంబం, ఎస్వీ కుటుంబం టీడీపీ వైపుకు రావడంతో కొంత సమీకరణాలు మారాయి. తాజాగా కోట్ల కుటుంబం కూడా చేరనుండడంతో టీడీపీ ఉత్సాహంగా కదులుతుంది.

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈనెల 28న తెదేపాలో చేరనున్నారు. ఇందుకోసం కోడుమూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా లక్ష మంది కార్యకర్తలతో ఈ సభ నిర్వహించడానికి కసరత్తు జరుగుతోంది. తదనుగుణంగా కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జనసేకరణ చేస్తున్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా తెదేపా తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఆలూరు, డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గాలూ తమకు కేటాయించాలని కోట్ల కుటుంబం ప్రతిపాదించింది.

ఉప ముఖ్యమంత్రి కేఈ కుటుంబం సీఎంతో భేటీ అయినప్పుడు పత్తికొండ, డోన్‌ తమకే కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ డోన్‌ కేఈ కుటుంబానికే ఇస్తే ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారు. కోట్ల కుమారుడు రాఘవేంద్రరెడ్డికి ఏదైనా పదవి కేటాయించే అవకాశం ఉండనుంది. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తుండగా ఆయన కర్నూల్ ఎంపీగా పోటీ చేసి లక్షా పది వేల ఓట్లు తెచ్చుకున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల తో పాటు, కర్నూల్ పార్లమెంట్ లో ఆయన పార్టీ విజయాన్ని ప్రభావితం చెయ్యగలరు. దీనితో ఆయన చేరికతో టీడీపీ జిల్లాలో బాగా బలపడబోతుంది. అయితే పాత కొత్త వారితో సమన్వయం చేసుకోగలిగితేనే ఇది సాధ్యం అవుతుంది. చంద్రబాబు ఏం చెయ్యబోతున్నారు చూడాలి.