Will TDP-BJP join hands again?ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏపీలో టిడిపి-బిజెపిలు మళ్ళీ చేతులు కలుపనున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. మూడు పార్టీలు మళ్ళీ చేతులు కలుపుతాయా లేదా అనేది ఇప్పుడే మాట్లాడుకోవడం తొందరపాటే అవుతుంది కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం అదే సూచిస్తున్నాయి.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు టిడిపి మద్దతు ప్రకటించగా ఆమె విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు టిడిపి, బిజెపి నేతలు ఆప్యాయంగా మాట్లాడుకొన్నారు. రెండు రోజుల క్రితం ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు దార్శనికుడు కనుకనే కేంద్రం అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చింది. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి అటువంటి దూరదృష్టి లేదు, నిధులు పక్కదారి పట్టిస్తారు అందుకే నిధులు ఇవ్వడం లేదు,” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఇంతవరకు టిడిపిని చంద్రబాబు నాయుడుని విమర్శించడమే తప్ప ఏనాడూ ఓ మంచిమాట అనని సోము వీర్రాజు చంద్రబాబు నాయుడుని ఇంతగా పొగడటం గమనిస్తే బిజెపి మెత్తబడుతోందని, టిడిపితో పొత్తులకి సానుకూల సంకేతం పంపినట్లు భావించవచ్చు. ఇది జరిగిన మర్నాడే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ నిన్న జరిగిన ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొనప్పుడు, ప్రధాని నరేంద్రమోడీ వచ్చి చంద్రబాబు నాయుడిని ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.

ఇంతకాలం ఉప్పునిప్పులా ఉన్న టిడిపి-బిజెపిలు ఈవిదంగా క్రమంగా దగ్గరవుతుండటం చూస్తే పవన్‌ కళ్యాణ్‌ కోరుతున్నట్లు వచ్చే ఎన్నికలలో మళ్ళీ జనసేన-టిడిపి-బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. కానీ ఒకవేళ వాటి మద్య మళ్ళీ పొత్తులు కుదిరినా ఈసారి రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదికనే ఉండాలి. అంటే అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం, అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రాన్ని బయటపడేయటం, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, విభజన హామీల అమలు వంటి అంశాలే పొత్తులకు ప్రాతిపదిక కావాలి తప్ప సీట్ల లెక్కలకు పరిమితం కాకూడదు.

ఈ విషయంలో బిజెపి, జనసేనలు మరింత స్పష్టమైన విధానాలతో ముందుకు రావలసిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు కూడా వాటిని విశ్వసిస్తారు. అప్పుడే జగన్ ప్రభుత్వం సృష్టించిన ‘మాయ సంక్షేమ ప్రపంచం’ పటాపంచలై ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం మొదలవుతుంది.

రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలనే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. వారి ఆకాంక్షలను నెరవేర్చాలనే ఆలోచన, తపన, చిత్తశుద్ది వైసీపీకి లేకపోవడం దురదృష్టకరమే. కనుక ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చేవారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ టిడిపి, బిజెపి, జనసేన పార్టీలైనా వారి ఆకాంక్షలను నెరవేర్చగలిగితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. మూడు పార్టీలను నెత్తిన పెట్టుకొంటారు.