Will Pawan Kalyan-janasena -contest in telangana electionsతెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. నామినేషన్ల పర్వానికి ఈ రోజుతో కలిపి ఇంక రెండు రోజులే సమయం ఉంది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి వారితో నామినేషన్లు వేయిస్తున్నాయి. ఈ తంతు ముగిసిపోతే ఇక ప్రచారమే. మరోవైపు తెలంగాణ ఎన్నికలలో జనసేన కథ మౌనంగానే ముగిసిపోయింది. కొద్ది రోజుల క్రితం వరకు పోటీపై ఆలోచన చేస్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉన్నారు. రెండు మూడు రోజులలో తేల్చి చెబుతాం అని చెబుతూ వచ్చారు. అయితే ఆ రెండు రోజులు ఇప్పటికీ రాలేదు.

దీనితో జనసేన పోటీ చెయ్యనట్టే. జనసేనతో జట్టు కట్టడానికి ఎంతో ఆత్రంగా ఎదురు చుసిన వామపక్షాలు తమ దారి తాము చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం వేచి చూసి నష్టపోయాం అనే భావం వారిలో ఉంది. పార్టీ పెట్టిన మొదటి ఎన్నికలలోనే పోటీ చెయ్యకపోతే ఇక పార్టీ భవితవ్యం ఏమిటని ఆ పార్టీ తెలంగాణ క్యాడర్ నిరాశలో మునిగిపోయింది. సరిగ్గా జగన్ ఎలా అయితే తెలంగాణాలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కథ ముగించారో పవన్ కళ్యాణ్ కూడా అలాగే జనసేన కథ ముగించారు.

“అజ్ఞతవాసి రిలీజ్ కు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి మీడియా ముందుకు వచ్చి ఆయనను పొగడటంతోనే జనసేన కథ తెలంగాణాలో ముగిసిపోయింది. పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టుకుని తనని తాను ఆంధ్ర వాడిగా ప్రకటించకుండానే ప్రకటించడంతో జనసేన తెలంగాణలో పెద్దగా ఎదగ లేదు. ఎన్నికలను కేసీఆర్ ముందుకు జరపడం పుండు మీద రోకలి పోటులా అయ్యింది,” అని విశ్లేషకులు జనసేన తెలంగాణ మజిలీని విశ్లేషిస్తున్నారు.