Will Pawan Kalyan Campaign for BJP candidate in tirupatiజనసేనతో పట్టుబట్టి మారీ తిరుపతి ఉపఎన్నిక సీటు తీసుకుంది బీజేపీ. మాజీ ఐఏఎస్ రత్నప్రభ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల ముందు తిరుపతిలో గెలుపు, రెండో స్థానం అంటూ బీరాలు పలికిన బీజేపీ కడకు షెడ్యూల్ వచ్చాకా పూర్తిగా చల్లబడిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే కనీసం పరువు నిలబెట్టుకోవచ్చని అభ్యర్థితో పాటు ఆ పార్టీ పెద్ద నేతలు హైదరాబాద్ లో వాలిపోయారు.

ప్రచారానికి రమ్మని పవన్ ని అభ్యర్ధించారు. అయితే ప్రచారానికి వెళ్లకూడదని పవన్ పై పార్టీ సమర్ధకుల నుండి గట్టి ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో బీజేపీకి ఆరో స్థానం దక్కింది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు 7,22,877 ఓట్లు వచ్చాయి.

టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు రాగా మూడో ప్లేస్‌లో నోటాకు 25,781 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరికి 16,125 ఓట్లు రాగా ఆరో స్థానంలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మినహాయించి మిగిలిన రాజకీయ పార్టీలకు మాత్రం డిపాజిట్‌ కూడా రాకపోవడం విశేషం.

ఈ సారి కనీసం రెండో స్థానం రాకపోతే ప్రజలు ఆ పార్టీ ని సీరియస్ గా తీసుకోరు. అదే విధంగా జనసేన కూడా ఇదివరకటిలా ఏది అంటే దానికి తల ఊపే పరిస్థితి ఉండదు. అసలు పొత్తుకే ఎసరు వచ్చే అవకాశం కూడా ఉంది. దానితో ఈ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ బీజేపీకి తన స్థానం ఏంటో తెలిసొచ్చేలా చేస్తే మంచిదని జనసైనికుల అభిప్రాయం.