Will Narendra modi give appointment to amaravati farmersఅమరావతి రైతులు, ఐకాస నేతలు రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి కేంద్రంలోని నేతలను కలుస్తున్నారు. ఈరోజు ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి రాజధాని సమస్యలు వివరించారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసుల దాడులను ఆయన దృష్టికి తెచ్చారు.

రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలించకుండా చూడాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వారు ఈ ట్రిప్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాల అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతో రైతులు తమ ఆశలన్నీ కేంద్రం మీదే పెట్టుకున్నారు. దాదాపుగా రెండు నెలల పాటు అమరావతి వివాదం చెలరేగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై మౌనంగానే ఉంది. రాష్ట్ర బీజేపీ కూడా ఈ విషయంలో రెండుగా చీలిపోయి తలో మాట మాట్లాడుతూ మరింత గందరగోళం సృష్టిస్తున్నారు.

కన్నా, సుజనా వంటి వారైతే కేంద్రం అమరావతిని మార్చడానికి ఊరుకోదు అంటుంటే…. జీవీఎల్ వంటి వారు ఇందులో కేంద్రం పాత్ర ఏమి ఉండదని ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అని చెప్పుకొస్తున్నారు. దీనితో రైతులకు వారు ఆపాయింట్మెంట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం వైఖరి బయటపడే అవకాశం ఉంది.