will nara lokesh win in mangalagiri constituencyin 2024వైసీపీ నాయకుల చీత్కారాలు., వెక్కిరింపులు., అవహేళనలు., ఈసడింపులతో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రాజకీయాలలో రోజురోజుకి రాటు తేలుతున్నారు. రాజకీయ రణరంగంలో ప్రత్యర్థి పార్టీల విమర్శలు సహజమే., కానీ ఒక వ్యక్తిని., వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేయడం స్వాగతించాల్సిన అంశం కాదు.

విదేశాలలో చదువుకున్న చదువుతో, తెలుగు భాష మీద పట్టులేక గతంలో చాలా సందర్భాలలో తన ప్రసంగాలలో తడబడడం., మాటలలో చతురత లేకపోవడం ప్రత్యర్థి పార్టీలకు వరంలా మారాయి. తెలుగు భాషతో మొదలైన “అవమానాలు” బాడీ షేపింగ్ వరకు వెంటాడాయి. ఆ అవమానాలనే తన ‘ఆయుధాలుగా’ మలచుకుని ప్రత్యర్ధులు కూడా ఆశ్చర్యపోయేలా నేడు లోకేష్ మాటల దాడితో విరుచుకుపడుతున్నారు లోకేష్.

గతంలో మైక్ పట్టుకున్న ప్రతిసారి ప్రత్యర్థి పార్టీలకు అవకాశమిచ్చిన లోకేష్, ఇపుడు ప్రెస్ మీట్లు నిర్వహించి విలేకర్లు అడిగే ప్రతి ప్రశ్నకు తడబడకుండా బదులిస్తున్నారు. అంతేకాక తమ ప్రత్యర్థి నేతలకు పంచ్ లు., సెటైర్లు., వ్యంగ్యాస్త్రాలతో ప్రశ్నలు – సమాధానాలతో చెలరేగిపోతున్నారు. లోకేష్ తన భాష మీదే కాదు, తన శరీర సౌష్టవం మీద పూర్తి నియంత్రణ సాధించి కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు.

ప్రభుత్వ విధానాల మీద విమర్శలకు తగ్గేదేలే అన్నట్లు లోకేష్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. కల్తీ మద్యం మరణాల సంఘటనతో ”జే బ్రాండ్స్” అంటూ., పెంచిన విద్యుత్ ఛార్జీలకుగాను “బాదుడే – బాదుడు” అంటూ., కొత్తగా విధించిన చెత్త పన్నుకుగాను “చెత్త ముఖ్యమంత్రి” అంటూ., మూడు రాజధానుల నిర్ణయంతో మాట తప్పిన జగన్ “మోసపు” రెడ్డి అంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు.

తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో కూడా పోటీ చేసి గెలుపును అందిపుచ్చుకోలేకపోయిన లోకేష్ పై వైసీపీ నేతలు ‘పప్పు’ అంటూ అవహేళన చేశారు. ‘పప్పు’ ఆరోగ్యానికి హానికరం కాదు., కానీ ‘నిప్పు’ ఆరోగ్యానికే కాదు ఆస్తులకు హానికరమే. నిప్పు చేతిలో ఉన్నవారికే కాదు తన పక్కనున్న వారికి కీడునే సూచిస్తుంది అంటూ పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నిప్పుని చేతిలో పెట్టుకుని తనతో పాటు తనను నమ్మిన వారిని సైతం జగన్ జైలుకు పంపుతారని, అక్రమాస్తుల కేసులో తనతో పాటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు., అప్పటి మంత్రులకు పడిన శిక్షలను ఉదహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులు కూడా ఈ నిప్పు కారణంగా ‘కూల్చివేతలకు’ బలయ్యాయని., రాజధాని ప్రాంతవాసుల ఆశలపై కూడా జగన్ నిప్పులు కురిపించారని దుయ్యబట్టారు.

తానూ పోటీకి ఎంచుకున్న మంగళగిరి నియోజకవర్గం టీడీపీ కంచుకోట కాదు, ఈ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరి రెండు దశాబ్దాలే దాటిందని చెప్పవచ్చు. అటువంటి ప్రాంతంలో పార్టీ గెలుపు “నల్లేరు మీద నడక” మాదిరి ఉండదు అని తెలుసుకున్న లోకేష్, ఇప్పుడు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ప్రతి గడప తొక్కుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధించిన కరెంట్ కోతలకు నిరసనగా మంగళగిరిలో లోకేష్ పర్యటించి ప్రజలకు కొవ్వొత్తులు, విసన కర్రలు., అగ్గిపెట్టలు పంపిణి చేశారు.

‘ఫ్యాన్’ గుర్తుకు ఓటేశారు, ఇప్పుడు మీ ఇంట్లో ‘ఫ్యాన్’ను జగన్ ‘మోసపు’ రెడ్డి కట్ చేసాడు అంటూ ప్రభుత్వం పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఓడిన చోటే నెగ్గాలనే కృషి.., తలదించిన చోటే తలెత్తి కాలర్ ఎగరేయాలన్నపట్టుదల.., లోకేష్ తను ఎదుర్కొన్న అవమానాల ద్వారా తానూ సంపాదించుకున్న అనుభవాల ద్వారా పొందగలిగారన్నది వాస్తవం.

పొందిన అనుభవాలతో., ఎదుర్కొన్న అవమానాలతో మంగళగిరిలో పసుపు జెండా రెపరెపలాడించి చరిత్రను తిరగరాయాలని తెలుగు తమ్ముళ్లు వేయి కళ్ళతో నిరీక్షిస్తున్నారు.