will KCR Telangana sentiment speeches workఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు తమ శక్తి వంచన లేకుండా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రజలు ఎటు వైపు ఓటు వేస్తారని సర్వత్రా ఆసక్తిగా ఉంది. నాలుగున్నర ఏళ్ళలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గా ఉన్న తెరాస గత కొద్ది రోజులుగా కొంచెం కలవరపాటుకు గురవుతుందా? మహాకూటమి ఏర్పాటుతో గెలుపుపై అనుమానాలు ఉన్నాయా? అనే అనుమానాలు ఉన్నాయి.

చేసిన అభివృద్ధి కంటే తెలంగాణ సెంటిమెంటు, చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలతోనే తెరాస ఎన్నికల ప్రచారం సాగుతుంది. సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ఈ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. తెలంగాణ సాధించాక కూడా తెలంగాణ సెంటిమెంట్ పని చేస్తుందా అనేది చూడాలి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ దీనిని తట్టుకోవడానికి తెలంగాణ తల్లి సెంటిమెంట్ తెర మీదకు తెచ్చింది. ఏకంగా సోనియా గాంధీనే తెర ముందుకు తెచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాక మొదటి సారిగా రాష్ట్రానికి వచ్చిన సోనియా తనని తాను తెలంగాణ తల్లిగా చెప్పుకున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఏ రాష్ట్రంలోనూ సోనియా గాంధీ ప్రచారం చెయ్యలేదు. ఒక తెలంగాణకే ఆవిడను తీసుకొచ్చారు. అప్పుడే పుట్టిన బిడ్డకు మొదట్లో ఎంతో సంరక్షణ ఉండాలని అయితే కేసీఆర్ చేతుల్లో పడి తెలంగాణ తల్లడిల్లిపోతుందని, అది చూసి తన కడుపు తరుక్కు పోతుందని సోనియా గాంధీ చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే రాజకీయంగా నష్టపోతాం అని తమకు తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చాము అని ఆవిడ చెప్పారు.

సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల్లోకి బానే వెళ్లాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వకపోతారా అని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఉన్నారు. దీనితో ఈ ఎన్నికలలో ఏది పనిచేస్తుందనేది చూడాలి – తెలంగాణ సాధన సెంటిమెంటా… తెలంగాణ తల్లి సెంటిమెంటా? ప్రజలు ఎవరికీ అవకాశం ఇస్తారు అనేది డిసెంబర్ 11న తేలిపోతుంది. డిసెంబర్ 7న ఒకే విడతలో తెలంగాణకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ కు అవకాశం వస్తే మాత్రం ఎనిమిది నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసినందుకు కేసీఆర్ జీవితాంతం బాధ పడటం ఖాయం.