will Kapu Reservation Bill withstand in courtఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపుల రిజర్వేషన్ అంశం మరో సారి తెర మీదకు వచ్చింది. ఈ రోజు ఉదయం ఏపీ శాసనసభ ముందుకు కాపు రిజర్వేషన్ బిల్లు వచ్చింది. కాసేపటి క్రితం బీసీ సంక్షేమ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లను మంత్రి అచ్చెన్నాయుడు బిల్లులో ప్రతిపాదించారు. కాపు రిజర్వేషన్ బిల్లుపై రేపు సభలో చర్చ జరుగనుంది.

కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ ఇస్తూ తెచ్చిన బిల్లు లో వీటి కోసం రాష్ట్రాలు తమ అవసరాల మేరకు నిబంధనలు రూపొందించుకోవచ్చు అని ఒక క్లాజ్ పెట్టింది. ఇప్పుడు అది చట్టంగా మారింది. దానిని వాడుకుని కాపులకు ఆ 10% లో సగం అనగా 5% రిజర్వేషన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. తాము తెచ్చిన చట్టం చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ది కోసం వాడుకోవడంతో కమలనాథులు షాక్ కి గురయ్యారు.

అన్ని అగ్రవర్ణాల పేదలకు ఉద్దేశించిన చట్టం ఒకరి కోసం పరిమితం చెయ్యడం అన్యాయమని వాదిస్తున్నారు. ఇది కులాల మధ్య కుంపటి పెట్టేందుకే అని వారి వాదన. పైగా ఏపీ అసెంబ్లీ చేస్తున్న ఈ చట్టం కోర్టులలో నిలబడదని వారు వాదిస్తున్నారు. కోర్టులలో ఏమవుతుందో తరువాతి సంగతి కాపులకు తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నిబద్దత తమకు ఉందని చంద్రబాబు చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో ఇది కోర్టుల నిలబడుతుందని ప్రభుత్వం నమ్మకంగానే ఉందట.