Will Jr NTR get TDP Politburoహరికృష్ణ అకాలమరణం అనేక ప్రశ్నలను మిగిల్చింది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి – హరికృష్ణకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కారణాలు ఏమైనా గానీ, మహానాడు వంటి విశిష్ట వేదికలపై కూడా హరికృష్ణ కానరాలేదు. ఇపుడు హరికృష్ణ తరం ముగిసింది. దీంతో సహజంగానే అందరి కళ్ళు తదుపరి తరం కళ్యాణ్ రామ్ & జూనియర్ ఎన్టీఆర్ లపై పడ్డాయి.

దీనికి తోడు ప్రధాన మీడియాలన్నీ రకరకాల కధనాలు ప్రసారం చేస్తున్నాయి. కొందరేమో… జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటారని చెప్తుంటే, మరికొందరేమో హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా కళ్యాణ్ రామ్ ను టిడిపి ప్రకటించబోతుందంటూ కధనాలను ప్రసారం చేస్తున్నాయి. వినడానికి ఇలాంటి వార్తలు నందమూరి అభిమానులకు బాగానే ఉంటాయి గానీ, కార్యరూపంలో ఇవన్నీ ఒట్టి పుకార్లుగానే మిగిలిపోతాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం తన సినిమాలు తాను చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఒక స్థాయిలో ఉన్నాడు. ఇప్పట్లో రాజకీయాల్లోకి రానని వివిధ సందర్భాలలో స్పష్టత కూడా ఇచ్చాడు. మీడియా వర్గాల కధనాలనే ప్రామాణికంగా చేసుకుని, ఒకవేళ తెలుగుదేశం అధిష్టానం నుండి ఏమైనా ప్రతిపాదనలు వెళ్ళినా… వాటిని సున్నితంగా తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

అందులోనూ హరికృష్ణ మరణించిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ గానీ రాజకీయ పదవులను అధిష్టిస్తారనుకుంటే, అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ప్రస్తుతం తండ్రిని కోల్పోయి మానసికంగా కృంగిపోయి ఉన్న ఈ నందమూరి బ్రదర్స్ కు, కొత్తగా రాజకీయ బాధ్యతలను టిడిపి అప్పచెప్తుందనుకోవడం కూడా పొరపాటే అవుతుంది.

అయినప్పటికీ పొలిట్ బ్యూరోలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక వార్తలకు ఎందుకు ప్రాధాన్యత లభిస్తోంది? అంటే వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలన్న సమాధానం వస్తుంది. ఏపీ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు గనుక, అటు సైడ్ నుండి జూనియర్ ఎన్టీఆర్ ను బరిలోకి దింపితే ప్రయోజనం చేకూరుతుందని, ఆ రీత్యా పవన్ కళ్యాణ్ ను నిలువరించవచ్చు, అలాగే వైసీపీకి కూడా చెక్ పెట్టవచ్చన్న టాక్ వీటికి బలాన్నిస్తోంది తప్ప, ఈ వార్తలు కార్యరూపం సిద్ధించుకునే అవకాశాలు ఏ మాత్రం లేవు.