will-dhruva-breaks-magadheera-records ధియేటిరికల్ ట్రైలర్ తర్వాత “ధృవ” సినిమాపై మెగా అభిమానుల్లో ఒక్కసారిగా పెరిగిన అంచనాలను చిత్ర యూనిట్ అదే టెంపోలో కొనసాగించేందుకు డిసెంబర్ 4వ తేదీన ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకు ఫిక్స్ కాని వెన్యూను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, పోలీస్ లైన్స్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ ఇచ్చారు.

ఇప్పటివరకు యూ ట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ 4 మిలియన్ క్లిక్స్ దాటి అందుకోవడంతో… ఈ సినిమా చెర్రీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ – గీత ఆర్ట్స్ కాంభినేషన్ లో వచ్చిన “మగధీర” సృష్టించిన రికార్డులే చెర్రీ కెరీర్ లో బెస్ట్. అయితే మళ్ళీ ఇదే కాంభినేషన్ లో డిసెంబర్ 9వ తేదీన విడుదల కానున్న “ధృవ” అదే స్థాయిలో రికార్డులను కొల్లగొడుతుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, అరవింద్ స్వామి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాప్ అందించిన పాటలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ట్రైలర్ లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై నమ్మకాలను పెంచింది. ‘రేసుగుర్రం’ ద్వారా అప్పటికి బన్నీ కెరీర్ లో భారీ హిట్ ను అందించిన సురేందర్ రెడ్డి, చెర్రీకి కూడా అదే ట్రాక్ రికార్డును కొనసాగిస్తాడో లేదో డిసెంబర్ 8వ తేదీన ప్రదర్శితం కానున్న ప్రీమియర్ షోలతో తెలిసిపోనుంది.