Will Congress Party use RevanthReddy and leave దేశం మొత్తం మీద ఎక్కడా కాంగ్రెస్ పార్టీ కి ఊపు అనేది లేదు. బీజేపీకి ఇప్పుడిప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నా దానిని అనుకూలంగా మరల్చుకోగల స్థితిలో కాంగ్రెస్ లేదు. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కు ఒక్కసారిగా ఊపు వచ్చింది. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చెయ్యడంతో ఆ పార్టీ క్యాడర్ సంఘటితం అవుతుంది.

కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి ఉన్న వైరం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ని గద్దె దించడమే రేవంత్ లక్ష్యమని తెలియంది కాదు. అయితే కాంగ్రెస్ హై కమాండ్ కు కేసీఆర్ ని గద్దె దించే ఆలోచన లేదు అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

“2023లో తెరాసని ఓడించడం కాంగ్రెస్ లక్ష్యం కాదు. బీజేపీని గెలవనివ్వకపోవడమే లక్ష్యం. ఇప్పటిదాకా తెలంగాణలో కాంగ్రెస్ మీద అంచనాలు లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ వైపునే ఉండిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ బలపడితే అది చీలి తెరాసకు లాభంగా మారుతుంది,” అని వారు విశ్లేషిస్తున్నారు.

“కాంగ్రెస్ లెక్క ప్రకారం 2023లో తెరాస అధికారంలోకి రావాలి. అయితే ఒంటరిగా కాకుండా కాంగ్రెస్ సాయంతో. తమకు వచ్చే సీట్లను బట్టి వారి బేరసారాలు ఉంటాయి. మరో రాష్ట్రం బీజేపీ ఖాతాలోకి వెళ్లకపోవడమే ముఖ్యోద్దేశం. అయితే దీనికి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా అంటే అది 2023 నాటి విషయం,” అని వారు చెబుతున్నారు.

అయితే కష్టకాలంలో పార్టీ పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాడుకుని వదిలేస్తుందా? అనేది అసలు ప్రశ్న. అయితే దీనికి సమాధానం 2023లోనే దొరుకుతుంది.