https://www.m9.news/politics/it-is-the-people-who-forced-pawan-kalyan-into-alliance-with-bjp/తిరుపతి ఉపఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నాయకత్వ మార్పు జరగనుందని రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును ఆ పదవి నుండి తప్పించి మరో సీనియర్ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు ఆ పదవి ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

అయితే ఇందుకు అనుగుణంగా కామినేని శ్రీనివాస్ ను సోము వీర్రాజు టార్గెట్ చేశారని టాక్ వినిపిస్తుంది. 2015లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన వైద్య పరికరాల స్కాం పై విచారణ వేగవంతం చెయ్యాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సోము వీర్రాజు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే… ఆ కాలంలో బీజేపీ టీడీపీ పొత్తులో ఉన్నాయి. భాగస్వామి కావడంతో కామినేని శ్రీనివాస్ కు వైద్యశాఖ మంత్రి పదవిని ఇచ్చారు చంద్రబాబు. ఆ కేసు విచారణ వేగవంతం చెయ్యడం… దోషులను కఠినంగా శిక్షించడం అంటే తమ పార్టీకే చెందిన కామినేని శ్రీనివాస్ ని శిక్షించమని చెప్పడమే కదా.

అధ్యక్ష పదవి పోకుండా సోము చేస్తున్న ప్రయత్నం ఇది అని ఆ పార్టీ వారే అభిప్రాయపడుతున్నారు. సోము వీర్రాజు ఎల్లప్పుడూ వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉంటారు అనే ముద్ర ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యాకా కూడా ఆయన వైఖరిలో పెద్దగా మార్పు రాలేదని ఆ పార్టీ వారే అంటారు. మరి వీర్రాజు కోసం సీఎం జగన్ ఆ పని చేసి పెడతారా అనేది చూడాలి