BJP Partyదేశంలో ప్రస్తుతం తిరుగులేని పార్టీ అది, దేశ రాజకీయాలను తొమ్మిదేళ్ళుగా కనుసైగలతో శాసిస్తున్న నాయకత్వం దాని స్వంతం, కానీ తెలుగు రాష్ట్రాల్లో కొద్ది సంవత్సరాలుగా దాని పరిస్ధితి గమనిస్తే ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా ఉంది. గట్టిగా పదివేల ఓట్లు లేని అస్సాం, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒంటి చేత్తో అధికారంలోనికి రాగలిగిన పార్టీ, ఒకప్పుడు బలమైన నాయకులు ఉండి, 18% వరకు ఓట్లు తెచ్చుకున్న చరిత్ర ఉన్న పార్టీ నానాటికీ తీసికట్టులా మారిపోవడం మాత్రం ఆశ్చర్యకరమే.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పార్టీ బరువు, భాద్యతలు మెుత్తం తన భుజాలపై మెూసిన పెద్దాయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యేక పరిస్ధితులకు అనుగుణంగా వీలైనప్పుడల్లా పొత్తులతో తగినన్ని సీట్లు గెలుచుకుంటూ, స్ధానిక నాయకులకు పదవులు తెస్తూ, పార్టీ ఉనికిని కాపాడుతూ వచ్చారు. పార్టీలో ప్రత్యర్థులు దానిని చూపించి ఆయనపై నిందలు వేసినా వాటిని భరిస్తూ పార్టీ భారాన్ని మెూసారు. 2014 తరువాత జాతీయ నాయకత్వ ఆలోచనా సరళిలో వచ్చిన మార్పుకు తోడు, ఇక్కడ కాంగ్రేసు పార్టీ ఉన్న గడ్డు పరిస్ధితుల్లో ఆ పార్టీని తమ గుప్పెట పెట్టుకున్న వర్గం నెమ్మదిగా బిజేపి వైపు చూడటం మెుదలు పెట్టింది. దేశంలో బలంగా ఉన్న ఈ పార్టీలో తమ ప్రాబల్యం పెంచుకునే ఎత్తుగడతో మూడు దశతాబ్దాలు పార్టీని నిలబెట్టిన పెద్దాయనపై ఢిల్లీ నాయకత్వంలో అనుమానాలు పెంచి ఆయనను ప్రత్యక్ష రాజకీయాల నుండి పక్కకు పంపడంలో విజయవంతమైన ఆ వర్గానికి, అదే వర్గానికి చెందిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు తండ్రి పదవితో కూడబెట్టిన గుట్టలకొద్దీ మూలుగుతున్న అక్రమ సంపదతో ఆర్ధికంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందించాడనీ, అందుకు ప్రతిఫలంగా ఆ నాయకుడిపై ఉన్న అత్యంత తీవ్రమైన ఆర్ధిక నేరాల కేసులను చూసీ చూడనట్టు వదిలేయాలి వీలైతే అవి వీగిపోయేట్టు సహకరించాలనేది ఒప్పందమనీ చెప్పుకుంటారు.

ఇలా ఈ లాభీ నెమ్మదిగా తెలంగాణలో తమ వర్గానికి చెందిన నాయకులతో పార్టీని నింపడం మెుదలు పెట్టింది. ఆ పెద్దాయన తరువాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించిన ఇద్దరు బిసి యువ నాయకులను ఈ లాభీ నెమ్మదిగా తమ ఆర్ధిక బలంతో తొక్కేయడం మెుదలు పెట్టింది. అలాగే ఆంధ్రలో కూడా తమ మాట వినే నాయకులును పోషిస్తూ, ఇతర వర్గాలకు చెందిన బలమైన నాయకులకు పొగ పెట్టి పంపే విధంగా చేపించడం మెుదలు పెట్టింది. దాని పర్యవసానమే రెండు రాష్ట్రాల్లో మెూత్కుపల్లి, రావెల, స్వామిగౌడ్, దాసోజు, కన్నా వంటి అనేక మంది బలమైన నాయకులు పార్టీ వీడటం. ఈ లాభీకి కేంద్రంలో ఓ పెద్ద పదవిలో ఉన్న ఆ వర్గం నేత నాయకత్వం వహిస్తే, ఆ వర్గానికి చెందిన ప్రాంతీయ పార్టీ నాయకత్వం ఆర్ధిక అండదండలు అందిస్తున్నదనే ఆరోపణలు.

కాంగ్రేసును దశాబ్దాల పాటు చెరబట్టి, అక్కడ మరింకే వర్గ నాయకులు ఎదగకుండా వర్గ రాజకీయాలు చేసి ఆ పార్టీతో గరిష్ట ఆర్ధిక, రాజకీయ ప్రయెూజనాలు పొందిన ఈ వర్గం, ఇప్పుడు కష్టకాలంలో కాంగ్రేసు కాడి వదిలి, బిజేపి చూరున చేరి మళ్ళీ అవే వర్గ రాజకీయాలు నడుపుతుండటం బాదాకరం. కనీసం ఇప్పటికైనా కమల జాతీయ నాయకత్వం ఈ ఫ్యూడల్ లాభీని దూరం పెట్టి బిసి, దళిత నాయకులకు ప్రాధాన్యం ఇస్తేనే పార్టీకి ఇక్కడ భవిష్యత్తు అని ఆ పార్టీ శ్రేయెూభిలాషులు కోరుకుంటున్నారు.

శ్రీ కాంత్