Rahul Gandhi - Chandrababu Naiduతెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న కాంగ్రెస్ సభకు ఎపి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును పిలవడం లేదా? ఆయా పత్రికలలో ఇచ్చిన ప్రచార ప్రకటనలలో ఆయన ప్రస్తావన లేదు. మహాకూటమి తరపున అంతా కలిసి ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి. రాహుల్ గాందీతో కలిసి చంద్రబాబు రోడ్ షోలు నిర్వహిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. తరువాతి సంగతేమో గానీ సోనియా గాంధీ సభలకు మాత్రం చంద్రబాబు హాజరు కారు అని తెలుస్తుంది.

దీనితో సోనియా గాంధీ సభకు సంబందించి ఇచ్చిన ప్రచార ప్రకటనలలో చంద్రబాబు పేరు కనిపించలేదు. స్టేజి మీద టీడీపీ జెండాలు కూడా ఉండే అవకాశం లేదట. గ్రౌండ్ లో మాత్రం కార్యకర్తలు ఇరు పార్టీల జండాలు పట్టుకుని ఉండే అవకాశం ఉంది. ఆంధ్రాలో తెలుగు దేశం పార్టీకి నష్టం జరగకుండా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీతో ఇప్పటికే రెండు సార్లు చేతులు కలిపిన చంద్రబాబు ఆయనతో కలిసి ప్రచారం చేస్తే చెయ్యవచ్చుగాక.

ఈ నేపధ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మేడ్చల్‌లో నిర్వహించనున్న సోనియాగాంధీ ఎన్నికల ప్రచార సభకు కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ను ఆహ్వానించగలరా? అని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన బాబును పిలిస్తే ఓట్లు పడవనే భయంతో కాంగ్రెస్‌ నేతలు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. బాబు ముఖం చూస్తే పడే నాలుగు ఓట్లు కూడా పడవనే భయంలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారన్నారు.