will Arvind Kejriwal win delhi electionsప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఫిబ్రవరి 8వ తేదీన జరుగనుంది. ఓట్ల లెక్కింపు 11వ తేదీన జరుగుతుంది. అదే రోజు ఫలితాలు విడుదల చెయ్యనున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ 14వ తేదీన విడుదల అవుతుంది. నామినేషన్లు వేసేందుకు 21 చివరి తేదీ. ఎన్నికల ప్రకటన రావడంతో దిల్లీలో ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలలో 1,46,92,136 ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.

మొత్తంగా ఢిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ స్థానాలలో 13750 పోలింగ్ బూతులలో ఓటింగ్ జరగబోతుంది. చివరి సారిగా 2015లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 67 నియోజకవర్గాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది.

అదే సమయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం 3 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించలేదు. అయితే ఆ తరువాత బీజేపీ ఇక్కడ అనూహ్యంగా పుంజుకుంది. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం ఎంపీ సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుంది. దీనితో ఈ ఎన్నికలు రసవత్తరం కాబోతున్నాయి.